Share News

కుంభవృష్టి

ABN , Publish Date - Sep 25 , 2026 | 01:22 AM

నగరంలో బుధవారం రాత్రి కుంభవృష్టి కురిసింది.

కుంభవృష్టి

ఒక్క రోజులోనే 28 సెంటీమీటర్ల వర్షపాతం

లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం... రహదారులు చిన్నాభిన్నం

ఎక్కడికక్కడ కూలిన చెట్లు, ప్రహరీ గోడలు

నిలిచిన విద్యుత్‌ సరఫరా... పునరుద్ధరణకు తక్షణ చర్యలు

యంత్రాంగం మొత్తం అప్రమత్తం

విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

నగరంలో బుధవారం రాత్రి కుంభవృష్టి కురిసింది. తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో అంటే...రాత్రి ఎనిమిది గంటలకు మొదలైన వర్షం గురువారం ఉదయం వరకూ కొనసాగింది. దీంతో కాలువలు, గెడ్డలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. అనేక మార్గాలు చెరువులను తలపించాయి. పెద్ద పెద్ద కాలనీల్లో సైతం మోకాలు లోతు నీరు ప్రవహించింది. అనేక అపార్టుమెంట్లలోకి వరదనీరు చేరింది. పలు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు దెబ్బతిన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి గురువారం సాయంత్రం వరకు వరద నీరు వస్తూనే ఉంది. గంగవరం పోర్టుకు వెళ్లే పెదగంట్యాడ మార్గంలో నడుం లోతు నీరు నిలిచిపోయింది. సింథియా నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌కు వచ్చే మార్గంలో డాక్‌యార్డ్‌ వద్ద వరదనీరు చేరడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు రాకపోకలు స్తంభించిపోయాయి. వర్షంతో పాటు వీచిన బలమైన గాలులకు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. సబ్‌ స్టేషన్లలోకి వరద నీరు చేరింది. డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. స్తంభాలు నేలకొరిగాయి. అంతిమంగా అనేక ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మారికవలసలో ఫీడర్లు పాడైపోవడంతో రుషికొండ ఐటీ పార్కుకు విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. అన్ని కంపెనీలు గురువారం అంతా జనరేటర్లపైనే కార్యకలాపాలు నడిపాయి. ఒక్కో కంపెనీకి సరఫరా పునరుద్ధరించుకుంటూ వెళుతున్నారు.


జలాశయాలు కళకళ

భారీవర్షాలతో పెరిగిన నీటి మట్టాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీవర్షాలు కురుస్తుండడంతో నగరానికి తాగునీటిని అందించే రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఎల్‌నినో కారనంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో నగరానికి తాగునీటిని అందించే తాటిపూడి, మేహాద్రిగెడ్డ, రైవాడ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్లలో నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. డెడ్‌ స్టోరేజీకి చేరువ కావడంతో నగరంలో నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. మరో వారం, పది రోజులు అదే పరిస్థితి కొనసాగితే నీటి ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయని జీవీఎంసీ అధికారులు ఆందోళన చెందారు. ఇలాంటి తరుణంలో తీవ్ర వాయుగుండం ప్రభావడంతో ఈనెల 22 నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్లలోకి నీరు చేరిక మొదలైంది. ఈనెల 21వ తేదీ నాటికి డెడ్‌ స్టోరేజీ (44 అడుగుల)కి చేరువలో ఉన్న మేహద్రిగెడ్డ రిజర్వాయర్‌లో గురువారం సాయంత్రానికి 51 అడుగుల మేర నీరు చేరింది. అలాగే ముడసర్లోవ రిజర్వాయర్‌లో బుధవారం సాయంత్రం 154.4 అడుగులు ఉండగా గురువారం సాయంత్రం 163 అడుగులు ఉంది. తాటిపూడి రిజర్వాయర్‌లో ఈనెల 21వ తేదీ నాటికి 276 అడుగులు నీటిమట్టం ఉండగా గురువారం సాయంత్రానికి 280 అడుగులకు చేరింది. అలాగే రైవాడ రిజర్వాయర్‌లో నీటిమట్టం 102 మీటర్లు నుంచి 104 మీటర్లకు పెరిగింది. గంభీరం రిజర్వాయర్‌లో నీరు 123 అడుగులకు చేరింది.

వర్షపాతం...

విశాఖపట్నం జిల్లా బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు....

కేంద్రం మిల్లీమీటర్లు

తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం 280

ఎండాడ 277.8

రూరల్‌ తహశీల్దారు కార్యాలయం 271.2

అడవివరం 269.4

సెంట్రల్‌ జైలు 268.9

ధారపాలెం 268.6

మధురవాడ 263.5

బక్కన్నపాలెం 259.2

మధురవాడ వాంబే కాలనీ 259.0

మధురవాడ జోనల్‌ కార్యాలయం 256.3

సీతమ్మధార తహశీల్దారు కార్యాలయం 255.8

విశాలాక్షి నగర్‌ 255.7

పరదేశిపాలెం 253.8


నేడు కూడా పాఠశాలలకు సెలవు

విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని అన్ని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చే శారు. వర్షాలు కురవడంతో బుధ, గురువారాలు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి కూడా వర్షాలు కురుస్తుండడంతో ముందుజాగ్రత్తగా పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించినట్టు ఆయన తెలిపారు. సెలవు దినాలుగా ప్రకటించిన రోజులకు ప్రత్యామ్నాయంగా వేరొక రోజు పాఠశాలలు పనిచేయాల్సి ఉంటుందన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 01:22 AM