కేపీఐలో అగ్రస్థానం
ABN , Publish Date - May 08 , 2026 | 01:39 AM
ప్రభుత్వ పఽథకాల అమలు, పాలనా దక్షతను అంచనా వేసే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ)లో అనకాపల్లి జిల్లా అగ్రస్థానంలో స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ పథకాల అమలు, పాలనా దక్షతలో అనకాపల్లికి 89 స్కోరు
రాష్ట్రస్థాయిలో పలు రంగాల్లో అద్భుత ప్రతిభ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సులో విజయకృష్ణన్ నివేదిక
జీడీపీ రూ.69,475 కోట్లు, తలసరి ఆదాయం రూ.3,14,952 టార్గెట్
స్కిల్ సెన్సస్ సర్వే 93 శాతం పూర్తితో మొదటి స్థానం
‘పీఎం సేతు’ పథకం కింద జిల్లాకు రెండు స్కిల్ హబ్‌లు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ పఽథకాల అమలు, పాలనా దక్షతను అంచనా వేసే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ)లో అనకాపల్లి జిల్లా అగ్రస్థానంలో స్థానంలో నిలిచింది. వంద ఇండికేటర్స్‌కుగాను అత్యధికంగా 89 స్కోరు సాధించి మిగిలిన జిల్లాలను వెనక్కు నెట్టేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో అనకాపల్లి జిల్లాలో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికల నివేదికను కలెక్టర్ విజయకృష్ణన్ సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన భవిష్యత్తు లక్ష్యాలు, ఇంతవరకు సాధించిన ప్రగతిపై సమగ్ర నివేదికను విడుదల చేశారు.
జీడీపీలో 14, తలసరి ఆదాయంలో 15వ స్థానం
జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీపీ), ప్రజల తలసరి ఆదాయం పెంపులో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్ధేశించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా స్థూల ఉత్పత్తి రూ.60,107 కోట్లుగా (13.39 శాతం వృద్ధి) అంచనా వేశారు. 2026-27 నాటికి 15.59 శాతం వృద్ధితో రూ.69,475 కోట్లు సాధించాలని ప్రభుత్వం నిర్దేశించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అనకాపల్లి జిల్లా ప్రస్తుతం 14వ స్థానంలో వుంది. ఇక తలసరి ఆదాయం విషయానికి వస్తే.. 2025-26లో 13.4 శాతం వృద్ధితో అనకాపల్లి జిల్లా తలసరి ఆదాయం రూ.2,73,149కి చేరింది. ఈ ఏడాది (2026-27లో) 15.3 శాతం వృద్ధితో రూ.3,14,952కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. తలసరి ఆదాయంలో జిల్లా ప్రస్తుతం 15వ స్థానంలో ఉంది.
ఇతర రంగాల్లో లక్ష్యాలు...
పరిశ్రమల రంగం ద్వారా 2026-27లో రూ.34,042 కోట్లు (రాష్ట్రంలో 3వ స్థానం), సేవా రంగం ద్వారా రూ.16,846 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగాల ద్వారా రూ.13,210 కోట్ల మేర స్థూల విలువ జోడింపు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
స్కిల్ సెన్సస్ సర్వే 93 శాతం పూర్తి
జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన నైపుణ్య గణనలో అనకాపల్లి జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో మొత్తం 2,78,670 మందిని సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 2,58,776 మంది వివరాల నమోదు చేసి పూర్తి చేశారు. మిగిలిన 19,894 (ఏడు శాతం) మందికి సంబంధించిన సర్వే పెండింగ్‌లో ఉంది. దీనిని కూడా వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
జిల్లాకు రెండు స్కిల్ హబ్‌లు
యువత నైపుణ్యాలను పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ‘పీఏం సేతు’ పఽథకం కింద జిల్లాకు రెండు స్కిల్ హబ్‌లను ప్రభుత్వం మంజూరు చేశారు. వీటి ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.80 కోట్లను కేటాయించింది. ఇందులో కేంద్రం సగం.. అంటే రూ.40 కోట్లు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.26 కోట్లు, పరిశ్రమల నుంచి సీఎస్‌ఆర్ కింద రూ.14 కోట్లు సమకూర్చాలని నిర్ణయించారు. డిస్ర్టిక్ట్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్లాన్స్ కింద స్థానిక పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. తక్షణమే (ఏడాది కాలం) 3,775 మందికి ఉద్యోగ నైపుణ్య శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యకాలికంగా (2-3 ఏళ్లు) 5.390 మందికి, దీర్ఘకాలికంగా రానున్న మూడేళ్లలో 4,625 మంది యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ అందించనున్నారు. మూడు నెలలకోసారి జాబ్‌ఫెయిర్ నిర్వహించి, ఒక్కోపర్యాయం ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళికలు రూపొందించారు. కలెక్టర్ల కన్ఫరెన్స్ మొదటి రోజు ప్రజంటేషన్లలో అనకాపల్లి జిల్లా ప్రగతి ఆశాజనకంగా కనిపించింది. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళితే స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను సునాయాసంగా సాధించే అవకాశం వుంది.