ప్రయాణికుల భద్రతకే అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:58 AM
ప్రయాణికుల భద్రతకు, సరకును సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ సూచించారు.
డివిజనల్ రైల్వే మేనేజర్లు, విభాగాధిపతులతో దక్షిణ కోస్తా జోన్ జీఎం సందీప్ మాథుర్
విశాఖపట్నం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):
ప్రయాణికుల భద్రతకు, సరకును సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ సూచించారు. జోన్ కార్యాలయంలో డివిజనల్ రైల్వే మేనేజర్లు, ఇతర విభాగాధిపతులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గూడ్స్ షెడ్లను మెరుగుపరచాలని, పార్శిల్ కార్యాలయాల్లో సౌకర్యాలు పెంచాలని ఆదేశించారు. జోన్‌లో జరుగుతున్న వివిధ నిర్మాణాల్లో నాణ్యత బాగుండాలని, నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆ తరువాత విశిష్ట సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు పురస్కారాలు అందజేశారు. రాత్రి గస్తీ సమయంలో విరిగిన రైలు పట్టాను గుర్తించి, ప్రమాదాన్ని నివారించిన ట్రాక్ నిర్వాహకుడు బి.వెంకటరావు (తుని)కు, గూడ్స్ రైలులో వేడెక్కిన యాక్సిల్‌ను గుర్తించి లోకోపైలట్‌ను అప్రమత్తం చేసిన గుండ్లకమ్మ స్టేషన్ మాస్టర్ వీరబ్రహ్మం, వేలాడుతున్న లోహపు పట్టీ ఫ్లాష్ ఓవర్ కాకుండా నివారించిన సింహాచలం నార్త్ గూడ్స్ రైలు మేనేజర్ జైసింగ్ మీనాకు, గుంతకల్లులో రైలు నుంచి పడిపోయిన ప్రయాణికుడికి ప్రథమ చికిత్స అందించిన వెంకటగిరి గేట్‌మ్యాన్ లలిత్‌కుమార్‌కు ప్రత్యేక అవార్డులు ఇచ్చి అభినందించారు.