Share News

‘స్త్రీశక్తి’ వినియోగంలో టాప్‌

ABN , Publish Date - Sep 12 , 2026 | 01:03 AM

‘స్ర్తీశక్తి’ పథకం వినియోగంలో విశాఖపట్నం జిల్లా 93 శాతం ఆక్యుపెన్సీతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది.

‘స్త్రీశక్తి’ వినియోగంలో టాప్‌

98 శాతం ఆక్యుపెన్సీతో రాష్ట్రంలో మొదటిస్థానం

ఏడాదిలో 8.99 కోట్ల మంది ఉచిత ప్రయాణం

రూఫ్‌టాప్‌ సోలార్‌లో మాత్రం 22వ స్థానం

పీజీఆర్‌ఎస్‌పై 86 శాతం పాజిటివ్‌

డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీ, అన్న క్యాంటీన్ల నిర్వహణ, మహిళలపై నేరాలు, ఆలయాల్లో సేవలు, గంజాయి, రోడ్లపై గోతుల విషయంలో వ్యతిరేకత

రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్‌, హౌసింగ్‌, పారిశుధ్య నిర్వహణపై సానుకూలత

కలెక్టరేట్‌, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏలో అరకు కాఫీ సెంటర్లు

విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

‘స్ర్తీశక్తి’ పథకం వినియోగంలో విశాఖపట్నం జిల్లా 93 శాతం ఆక్యుపెన్సీతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ఈ పథకాన్ని 899.92 లక్షల మంది ఉపయోగించుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన రెండో రోజు సమావేశంలో వెల్లడించారు. ఇక ఇంటి పైకప్పులపై సోలార్‌ పథకాల ఏర్పాటులో విశాఖ జిల్లా 22వ స్థానంలో నిలిచింది. కేవలం 0.60 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌కు మాత్రమే యూనిట్లు ఏర్పాటుచేసింది. ఈ విషయంలో తగిన కృషిచేస్తామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ హామీ ఇచ్చారు. అనంత అరణ్య పథకంలో భాగంగా జిల్లాలో 7,092 చెట్లు, 44,128 పొదలు, 1,354 ఇతర మొక్కలు పెంచాలని లక్ష్యంగా ఇవ్వగా, అందులో 3.1 శాతం మాత్రమే లక్ష్యం సాధించారు. మెప్మా నుంచి 19,263 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలని ప్రభుత్వం లక్ష్యం ఇచ్చింది. ఆ దిశగా ఇంతవరకూ అడుగులు పడలేదు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)పై ప్రభుత్వం ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోగా 86 శాతం సానుకూలంగా స్పందించారు. ఈ విభాగానికి నివేదిక సమర్పించే నాటికి 6,186 వ్యక్తిగత ిఫర్యాదులు అందగా, వాటిలో 2,100 పెండింగ్‌లో ఉన్నాయి. సామాజిక సమస్యలకు సంబంధించిన 4,894 ఫిర్యాదులు అందగా వాటిలో 1,276 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై 82శాతం సానుకూలంగా, 18 శాతం వ్యతిరేకంగా స్పందించారు.

- గత కలెక్టర్‌ సమావేశం నాటికి ఉన్న ప్రజా సానుకూలతతో పోల్చుకుంటే ఇప్పటి సానుకూలత 2.1 శాతం తగ్గినట్టు నివేదికలో పేర్కొన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీ, అన్న క్యాంటీన్ల నిర్వహణ, మహిళలపై నేరాలు, ఆలయాల్లో సేవలు, గంజాయి, రోడ్లపై గోతులు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల నిర్వహణ తదితర అంశాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగింది. రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్‌, హౌసింగ్‌, పారిశుధ్యం, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీల మంజూరు అంశాల్లో గతం కంటే ఇప్పుడు సానుకూలత పెరిగింది.

- విశాఖ జిల్లాలో 20,29,652 మంది జనాభా ఉండగా వారిలో 2,33,220 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఏడాదిలోగా వారిని అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యం ఇచ్చారు.

- జిల్లాలో 88 జాబ్‌ మేళాలకు గాను 81 నిర్వహించి, ఇప్పటివరకు 6,383 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 92 శాతం లక్ష్యం సాధించారు.

- జిల్లాలో 89,374 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకూ 13,857 మందిని అంటే 15.5 శాతం మందికే రిజిస్ట్రేషన్లు జరిగాయి.

- జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, కార్పొరేషన్‌ కార్యాలయాల్లో అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు.


నేర నియంత్రణలో కమిషనరేట్‌ పురోగతి

గత ఏడాదితో పోల్చితే కేసులు తగ్గుదల

రోడ్డు ప్రమాదాలు కూడా...

పోలీస్‌ శాఖ పనితీరుపై సీఎం సమీక్ష

విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో గత ఏడాదితో పోల్చితే నగర పోలీసులు మెరుగైన ఫలితాలు సాధించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, పోలీస్‌ కమిషనరేట్‌ల పరిధిలో గత ఏడాదికాలంగా పోలీసుల పనితీరుపై సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం అమరావతిలో సమీక్షించారు.

నగర పరిధిలో అన్ని రకాల నేరాల సంఖ్య 2024 ఆగస్టు-2025 జూలైతో పోల్చితే గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు 19.4 శాతం తగ్గి రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అలాగే 2024-25లో 5,765 నేరాలు నమోదుకాగా గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు 4,649 కేసులు నమోదయ్యాయి. భౌతిక దాడులకు సంబంధించి 2024-25లో 726 కేసులు నమోదుకాగా గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు 567 కేసులు నమోదయ్యాయి. ఈ అంశంలో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆర్థిక నేరాలకు సంబంధించి 2024-25లో 752 కేసులు నమోదుకాగా గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు 616 కేసులకు (రాష్ట్రంలో తొమ్మిదో స్థానం) తగ్గాయి. మహిళలపై వేధింపులు, దాడులకు సంబంధించి 2024-25లో 1,069 కేసులు నమోదుకాగా గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు 799 కేసులు నమోదయ్యాయి. 25.3 శాతం తగ్గుదలతో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణలో భాగంగా 2024-25లో 284 నమోదుకాగా గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు 205 కేసులు నమోదయ్యాయి. పోలీసులు తీసుకున్న చర్యలు కారణంగా రోడ్డు ప్రమాదాలు 6.5 శాతం తగ్గాయని, మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టు సీపీ వివరించారు. నగరంలో అనేక ముఖ్యమైన కార్యక్రమాలు, బందోబస్తును విజయవంతంగా నిర్వహించామని సీఎంకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ద్వారా వివరించారు.

Updated Date - Sep 12 , 2026 | 01:03 AM