పర్యాటకంలో అగ్రస్థానం
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:40 PM
ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అందాల అరకులోయ పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలిచింది.
అరకులోయ టాప్
ద్వితీయ స్థానంలో మారేడుమిల్లి, తృతీయ స్థానంలో నంద్యాల
పాడేరు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అందాల అరకులోయ పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని వివిధ రంగాలు, ప్రభుత్వ విభాగాల స్థితిగతులు, పనితీరు, ప్రజల స్పందనపై వివరాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం, వాటిపై జిల్లాల వారీగా కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ క్రమంలో పర్యాటకానికి సంబంధించిన అంశంలో అరకులోయ ప్రాంతం అగ్రస్థానంలో నిలిచింది. ప్రకృతి అందాలు, పర్యాటకుల సందర్శన, వసతి, వారి సంతృప్తి స్థాయి సైతం ప్రఽథమ స్థానంలో నిలిపాయి. అలాగే రాష్ట్రంలోనే అరకులోయ ప్రాంతం పర్యాటకంగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. అలాగే కూటమి ప్రభుత్వం సైతం ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకువచ్చేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తుండడంతో పర్యాటకంగా మరింత ఖ్యాతిని గడిస్తున్నది. కాగా పర్యాటకంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో అరకులోయ నిలవగా, ద్వితీయ, తృతీయ స్థానాల్లో మారేడుమిల్లి, నంద్యాల ఉన్నాయి. పర్యాటకంగా అరకులోయ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.