తలసరి ఆదాయంలో టాప్
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:28 AM
తలసరి ఆదాయంలో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు.
స్థూల ఉత్పత్తిలో కూడా అగ్రస్థానంలో విశాఖ జిల్లా
నిధుల వినియోగం 84 శాతం
డ్రోన్ల వినియోగంలో చివరి స్థానం
ప్రభుత్వ పనితీరు సూచికల్లో గాజువాక నియోజకవర్గానికి ఏ+ గ్రేడ్
అమరావతి నుంచి ముఖ్యమంత్రి సమీక్ష
విశాఖలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఏర్పాటుచేయాలని సూచన
ఎమ్యూజ్‌మెంట్ పార్కుకు 75 ఎకరాలు
మార్చి నెలాఖరుకు పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తవుతాయన్న అధికారులు
విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):
తలసరి ఆదాయంలో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులలతో ఆయన సోమవారం అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు వర్చువల్‌గా జిల్లాల నుంచే సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం అన్ని శాఖల పనితీరు, పథకాల వినియోగం, కొత్త పరిశ్రమల పరిస్థితి, పర్యాటక ప్రాజెక్టులు, తదితర అంశాలన్నీ చర్చకు వచ్చాయి.
జిల్లాల స్థూల ఉత్పత్తిలో గత ఏడాది విశాఖ జిల్లా రూ.1,44,192 కోట్లతో ప్రథమ స్థానంలో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో కూడా రూ.1,60,771 కోట్లతో మొదటి స్థానాన్ని నిలుపుకొంది. అలాగే గత ఏడాది జిల్లాల తలసరి ఆదాయంలో విశాఖపట్నం రూ.5,91,104తో అగ్రస్థానంలో ఉండగా, ఈ ఏడాది కూడా రూ.6,58,091తో అదే స్థానంలో నిలిచింది. పరిశ్రమల ఏర్పాటులో రూ.54,253 కోట్లతో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అనకాపల్లి జిల్లా మూడో స్థానం దక్కించుకుంది.
- రాష్ట్రంలో టీనేజ్ పిల్లల ప్రసవాలు అత్యధికంగా 15 శాతం వరకు ఉండగా ప్రభుత్వం వాటిని ఐదు శాతానికి తేవాలని నిర్దేశించింది. విశాఖ జిల్లా 3.98 శాతంతో మెరుగ్గా ఉంది.
- జిల్లాలో 113 సివిల్ వర్కులు జరుగుతుండగా వాటిలో 36 మాత్రమే పూర్తి కాగా, మరో 63 ప్రాసెస్‌లో ఉన్నాయి. 14 పనులు ఇంతవరకు మొదలు కాలేదు.
- పోలవరం ఎడమ కాలువ పనులు 87 శాతం పూర్తయ్యాయని, మార్చి నెలాఖరుకు మొత్తం పూర్తయిపోతుందని అధికారులు పేర్కొన్నారు.
- ప్రభుత్వ పనితీరు సూచికల్లో (కేపీఎల్‌ఎస్) గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం 72 అంశాల్లో 92 శాతం స్కోరుతో ఏ ఫ్లస్ గ్రేడ్ సాధించింది.
- సీ ప్లేన్లు నడపడానికి ఎంపిక చేసిన విశాఖపట్నం, లంబసింగి, అరకు ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
- విశాఖలో అతి పెద్ద ఎమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు తక్షణం 75 ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్‌కు ఆదేశించారు.
- మే ఫెయిర్ సంస్థకు పర్యాటకాభివృద్ధి కోసం ఇచ్చిన భూమి విషయంలో ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయ భూమి చూడాలని సూచించారు.
- స్వర్ణాంధ్రప్రదేశ్‌లో భాగంగా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌లో ఐటీ, ఫార్మా సెజ్‌లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించాలని ఆదేశించారు. ఎగుమతులు పెంచాలన్నారు.
- రిజిస్ట్రేషన్ల శాఖ విశాఖలో సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రిజిస్ట్రేషన్ పూర్తయిన గంటలో డాక్యుమెంట్ ఇవ్వాలని సూచించారు. 24 గంటలు దాటితే కొరియర్‌లో ఇంటికి పంపాలన్నారు.
- జిల్లాకు రూ.319 కోట్ల నిధులు అందుబాటులో ఉండగా, వాటిలో 84శాతం అంటే రూ.269 కోట్లు వినియోగించుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
- ఇతర జిల్లాలతో పోల్చుకుంటే విశాఖట్నం జిల్లా డ్రోన్ల వినియోగం చివరి స్థానంలో నిలిచింది.