Share News

ఆర్థిక, సామాజిక వృద్ధిలో టాప్‌

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:37 AM

జిల్లాలో ఆర్థిక, సామాజిక వృద్ధి మెరుగ్గా ఉందని, పరిశ్రమల ఏర్పాటులో మాత్రం అట్టడుగున ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం అమరావతిలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల 8వ సదస్సులో గణాంకాలతో సహా వెల్లడించారు.

ఆర్థిక, సామాజిక వృద్ధిలో టాప్‌
అమరావతిలో జరిగిన సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌ నిషాంతి

మంచి స్కోరుతో ‘ఏ’ గ్రేడ్‌, గవర్నెన్స్‌లో ‘బీ’ గ్రేడ్‌

గృహ నిర్మాణం, జలధార- జలహారతిలో పురోగతి

పరిశ్రమల ఏర్పాటులో అట్టడుగున జిల్లా

కలెక్టర్ల సదస్సులో గణాంకాలు వెల్లడి

పాడేరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆర్థిక, సామాజిక వృద్ధి మెరుగ్గా ఉందని, పరిశ్రమల ఏర్పాటులో మాత్రం అట్టడుగున ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం అమరావతిలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల 8వ సదస్సులో గణాంకాలతో సహా వెల్లడించారు. జిల్లాల వారీగా వివిధ రంగాల్లో పురోగతి, ప్రభుత్వ శాఖల పనితీరుపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు రూపొందించిన గణాంకాలను కలెక్టర్లకు వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆర్థిక పురోగతిలో 100కు 75 స్కోర్‌ చేసి ఏ గ్రేడు, సామాజిక వృద్ధిలో 100కు 95 స్కోర్‌ చేసి ఏ గ్రేడు సాధించగా, గవర్నెన్స్‌లో మాత్రం 100కు 64 స్కోర్‌తో బీ గ్రేడు దక్కింది. ఇక సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటులో రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో ఉంది. జలధార- జలహారతిలో మంచి పురోగతి సాధించింది. మొత్తం 3,644 గ్రామాలకుగాను 2,773 గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించగా, 244 గ్రామ పంచాయతీల పరిధిలో 65,688 ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. 320 సెల్‌ టవర్ల ద్వారా శత శాతం సెల్‌ కనెక్టివిటీని అందించగా మరో 136 టవర్లతో కనెక్ట్‌విటీ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. 3,781 గ్రామాలకు తాగునీరు అందించాలన్నది లక్ష్యంకాగా ఇప్పటి వరకు 2,769 గ్రామాలకు నీటిని అందిస్తున్నారు. మరో 420 గ్రామాలకు సింగిల్‌ విలేజ్‌ వాటర్‌ స్కీమ్‌లను ప్రతిపాదించారు. జిల్లాలో 90 శాతం గృహాలకు ఎల్‌పీజీ వంట గ్యాస్‌ కనెక్షన్లు వున్నాయి. 1,48,897 గృహాలకు విద్యుత్‌ సదుపాయం వుండగా, 398 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు వున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిలో రాష్ట్రంలో అల్లూరి జిల్లా 26వ ర్యాంకులో ఉంది. గృహ నిర్మాణంలో ఆశించిన పురోగతి సాధిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 42,247 మందికి ఇళ్లు మంజూరు చేయగా, వీరిలో 41,598 మంది నిర్మాణ పనులు మొదలుపెట్టారు. వీటిలో 22,184 ఇళ్ల నిర్మాణ పూర్తికాగా మిగిలిన 19,414 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. జిల్లాలో 2,875 గ్రామాలను బహిరంగ మలవిసర్జనరహితంగా తీర్చిదిద్దారు.

2029 నాటికి ఆర్గానిక్‌ హబ్‌గా జిల్లా

సేంద్రీయ సేద్యం, కుంకుమ పువ్వు సాగుకు చర్యలు

కలెక్టర్‌ టి.నిషాంతి

అమరావతిలో గురువారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల 8వ సదస్సులో కలెక్టర్‌ టి.నిషాంతి మాట్లాడుతూ, జిల్లాలో సేంద్రీయ సేద్యం, కుంకుమపువ్వు సాగుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాను 2029 నాటికి పూర్తిస్థాయిలో ఆర్గానిక్‌ హబ్‌గా మార్చేందుకు 2024-25 నుంచే ప్రణాళికను అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి గిరిజన రైతు సాధికారత సంస్థ ద్వారా చేపడుతున్న చర్యల ఫలితంగా 2029 నాటికి జిల్లాలో అన్ని పంటలు సేంద్రీయ విధానంలో సాగవుతాయన్నారు. చింతపల్లి మండలంలో కుంకుమపువ్వు సాగును ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు చర్యలు చేపట్టామని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం ఆ మండలంలోని చెరువూరు గ్రామంలో 30 ఎకరాలను గుర్తించామన్నారు. అయితే ఇది ప్రభుత్వ భూమి అయినప్పటికీ స్థానిక గిరిజనులు సాగు చేసుకుంటున్నారని, వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడి, భూమిని స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందిస్తూ... కుంకుమపువ్వు సాగు, దాని వల్ల కలిగే లబ్ధిపై గిరిజన రైతులకు అవగాహన కల్పించి, వారిని ఒప్పించాలని సూచించారు.

Updated Date - Sep 11 , 2026 | 12:37 AM