Share News

టమాటా ధర పతనం

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:00 AM

మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు ఆదివారం రైతులు భారీ మొత్తంలో టమాటాలు తీసుకువచ్చారు. దీంతో ధర ఒక్కసారిగా పడిపోయింది. ఇక్కడ మార్కెట్‌కు సోమవారం సెలవు కావడంతో ఆదివారం రైతులు అధిక మొత్తంలో కూరగాయలు తీసుకువస్తుంటారు.

టమాటా ధర పతనం
టమాటా క్రేట్లతో కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్న రైతులు

దేవరాపల్లి మార్కెట్‌లో 25 కిలోలు రూ.250

ఇతర కూరగాయలదీ ఇదే పరిస్థిథి

మహాశివరాత్రి కావడంతో అరకొరగా వచ్చిన వ్యాపారులు

కొనుగోలుదారుల కోసం నిరీక్షించిన రైతులు

దేవరాపల్లి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు ఆదివారం రైతులు భారీ మొత్తంలో టమాటాలు తీసుకువచ్చారు. దీంతో ధర ఒక్కసారిగా పడిపోయింది. ఇక్కడ మార్కెట్‌కు సోమవారం సెలవు కావడంతో ఆదివారం రైతులు అధిక మొత్తంలో కూరగాయలు తీసుకువస్తుంటారు. ఇదే విధంగా పాడేరు, అనకాపల్లి, కొత్తవలస, కె.కోటపాడు, విశాఖపట్నం నుంచి వ్యాపారులు సైతం ఎక్కువ మంది వచ్చి, రెట్టింపు పరిమాణంలో కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. రైతులు యథా విధిగా ఈ ఆదివారం కూడా పలు రకాల కూరగాయలను అమ్మకానికి తీసుకొచ్చారు. అయితే మహాశివరాత్రి పండుగ కావడంతో కొనుగోలు చేసే వ్యాపారులు అంతగా రాలేదు. దీంతో పరిస్థితిని అంచనా వేసిన వ్యాపారులు.. కూరగాయల రేట్లను తగ్గించేశారు. ముఖ్యంగా టమాటాల ధరలు భారీగా పతనం అయ్యాయి. గత వారం సుమారు 25 కిలోలు వుంటే క్రేట్‌ టమాటాలు రూ.500 పలకగా, ఈ ఆదివారం రూ.250కి పడిపోయాయి. పది గంటల తరువాత కొనుగోలుదారులు తగ్గిపోవడంతో క్రేట్‌ టమాటాలు రూ.200లకే ఇచ్చేయాల్సి వచ్చింది. ఇక చిక్కుడు కాయలు క్రేట్‌ (12 కిలోల) 220కి పడిపోయింది. గత వారం రూ.660కి వ్యాపారులు కొనుగోలు చేశారు. బీర కాయలు క్రేటు (25 కిలోలు) రూ.600 పలికింది. గత వారం రూ.900 పలికిందని రైతులు చెబుతున్నారు. ఇంకా పలు రకాల ఆకు కూరల ధరలు సైతం తగ్గాయి. ఒకేసారి పలు రకాల కూరగాయలు కోతకు రావడం, మరోవైపు మహాశివరాత్రి పండుగ సందర్భంగా వ్యాపారులు అరకొరగా రావడం ధరలు తగ్గడానికి కారణమని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 01:00 AM