Share News

హైవే పూర్తి కాకుండానే టోల్‌ బాదుడు

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:16 AM

జాతీయ రహదారి 516-ఈ మొత్తం రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండానే హుకుంపేట మండలం పెదగరువు వద్ద టోల్‌ ఫీజును వసూలు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఎక్కడైనా రోడ్డు నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత టోల్‌ ఫీజు వసూలు చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా పాడేరు శివారు చింతలవీధి నుంచి అరకులోయకు కేవలం 40 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం పూర్తవ్వగానే టోల్‌ ఫీజు వసూలు ప్రారంభించడంపై ప్రయాణికులు, వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైవే పూర్తి కాకుండానే టోల్‌ బాదుడు
హుకుంపేట మండలం పెదగరువు వద్ద ఏర్పాటు చేసిన టోల్‌ ప్లాజా

- టోల్‌ ఫీజు వసూలుపై విమర్శల వెల్లువ

- అరకులోయ వెళ్లాలంటే అదనపు ఖర్చు

- మన్యం వాసులకే అధిక ఇబ్బంది

- అనంతగిరి మండలం కాశీపట్నంలో వలే స్థానికులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జాతీయ రహదారి 516-ఈ మొత్తం రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండానే హుకుంపేట మండలం పెదగరువు వద్ద టోల్‌ ఫీజును వసూలు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఎక్కడైనా రోడ్డు నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత టోల్‌ ఫీజు వసూలు చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా పాడేరు శివారు చింతలవీధి నుంచి అరకులోయకు కేవలం 40 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం పూర్తవ్వగానే టోల్‌ ఫీజు వసూలు ప్రారంభించడంపై ప్రయాణికులు, వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీ వాసులు కేవలం విశాఖపట్నం, ఎస్‌.కోట, నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి ప్రాంతాలకు మాత్రమే ఎక్కువగా రాకపోకలు సాగిస్తుండడంతో టోల్‌ ఫీజు సమస్య ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలోని కార్లు, జీపులకు సైతం ఫాస్టాగ్‌ అవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలో పాడేరు నుంచి అరకులోయ వెళ్లే జాతీయ రహదారిలో ఈ నెల 13 నుంచి హుకుంపేట మండలం పెదగరువు వద్ద టోల్‌ ప్లాజాను ప్రారంభించి, వాహనదారుల నుంచి ఫీజులను వసూలు చేస్తున్నారు. అయితే పాడేరు, హుకుంపేట ప్రాంతాలకు చెందిన వాళ్లు సమీపంలో ఉన్న రంగశీల, కించుమండ, డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాలకు కార్లలో వెళ్లాలంటే రానుపోను(ఫాస్టాగ్‌ లేకుండా) రూ.100 టోల్‌ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ మండలాలకు చెందిన స్థానికులు, వర్తకులు, ఉద్యోగులు నిత్యం ఆయా నాలుగు మండలాల్లో తిరుగుతుంటారు. ఈ క్రమంలో వారి కార్లకు రాను పోను రూ.100 అదనంగా టోల్‌ ఫీజు ఖర్చు కావడంపై పెదవి విరుస్తున్నారు. సదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, గూడ్స్‌ వాహనాలకు టోల్‌ ఫీజు వసూలు చేయడం సహజం. కానీ స్థానికులు నిత్యం తిరిగే ప్రాంతాల్లో టోల్‌ ఫీజును చెల్లించాల్సిన పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఆర్‌టీసీ బస్సుల్లోని ప్రయాణికులకు సైతం రానుపోను అదనంగా రూ.20 భారం పడుతున్నది. కాగా అనంతగిరి మండలం కాశీపట్నం వద్ద ఏర్పాటు చేసిన టోల్‌ ప్లాజాలో ఏజెన్సీ వాసులకు పూర్తిగా మినహాయింపు ఉంది. అక్కడ కేవలం పర్యాటకులు, ఇతర ప్రాంతాలకు చెందిన వాహనాలకు మాత్రమే టోల్‌ ఫీజును వసూలు చేస్తారు. అందువల్ల హుకుంపేట మండలం పెదగరువు వద్ద టోల్‌ ప్లాజాలోనూ అదే తరహా నిబంధన అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:16 AM