నేడే పరిషత్ ఓటరు తీర్పు
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:06 PM
జిల్లాలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును శనివారం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
జిల్లాలో 11 కేంద్రాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు
మొత్తం ఓట్లు: 4,98,465, పోలైన ఓట్లు: 3,09,133
కౌంటింగ్‌కు మొత్తం 298 టేబుళ్లు,
ఎంపీటీసీ ఓట్లకు 149, జడ్పీటీసీ ఓట్లకు 149 కేటాయింపు
తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
1200 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును శనివారం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి మండల కేంద్రంలోనూ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని సిద్ధం చేశారు. జిల్లాలో 11 మండలాల్లోనూ 11 కౌంటింగ్ కేంద్రాలు, 298 టేబుళ్లను ఏర్పాటుచేశారు. వాటిలో 149 టేబుళ్లు ఎంపీటీసీ స్థానాలకు, 149 టేబుళ్లు జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపునకు కేటాయించారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ కోసం 1200 మంది సిబ్బందిని నియమించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కిస్తారు. జిల్లాలో మొత్తం 3,086 పోస్టల్ బ్యాలెట్లు నమోదుకాగా వాటిలో పురుషులు 2,205 మంది, మహిళలు 881 మంది ఉన్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా 6 వేల మంది ఎన్నికల సిబ్బందిలో 3 వేల మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించడం గమనార్హం.
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారుల అనుమతి ఉన్నవాళ్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశం కల్పిస్తారు. రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లు, కార్యకర్తలు సైతం గుంపులుగా కౌంటింగ్ కేంద్రాల వద్ద సంచరిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీడియాకు కౌంటింగ్ సమాచారాన్ని అందించేందుకు ప్రతి కౌంటింగ్ కేంద్రంలోనూ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 11 కౌంటింగ్ కేంద్రాల్లోని ప్రక్రియలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి, పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లోని అవసరమైన ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో 62.01 శాతం పోలింగ్
జిల్లాలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల్లో 62.01 శాతం పోలింగ్ జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి. కలెక్టర్ టి.నిషాంతి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 11 మండలాల్లో 617 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 4,98,465 మంది ఓటర్లకుగానూ 3,09,133 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ 62.01 శాతంగా నమోదైంది. జిల్లాలో అనంతగిరి మండలంలో 65.34 శాతం, అరకులోయలో 68.34, చింతపల్లిలో 52.25, డుంబ్రిగుడలో 73.63, జి.మాడుగులలో 58.36, జీకేవీధిలో 53.28, హుకుంపేటలో 68.32, కొయ్యూరులో 61.50, ముంచంగిపుట్టులో 63.76, పాడేరులో 65.29, పెదబయలు మండలంలో 60.48 శాతం పోలింగ్ నమోదైంది.
ఓట్ల కౌంటింగ్ కేంద్రాలివే...
జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ప్రతి మండల కేంద్రంలోనూ కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. జిల్లా కేంద్రం పాడేరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవనం, అనంతగిరిలో కొత్తవలస గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, అరకులోయలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, చింతపల్లిలో గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల, డుంబ్రిగుడలో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, జీకేవీధిలో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, జి.మాడుగులలో కొత్తూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల 2, హుకుంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొయ్యూరులో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, ముంచంగిపుట్టులో ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోని డీఆర్‌డీఏ గోదాము, పెదబయలులో క్లారెషియన్ పాదర్స్ విద్యానికేతన్ బాయ్స్ హాస్టల్‌లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతోపాటు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.