నేడు అప్పన్న వార్షిక తిరుకల్యాణోత్సవం
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:11 AM
అనాదిగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ చైత్రమాస శుక్లపక్ష ఏకాదశినాడు అంటే ఆదివారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహుని వార్షిక తిరుకల్యాణోత్సవం నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
సింహగిరిపై విస్తృత ఏర్పాట్లు
సింహాచలం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
అనాదిగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ చైత్రమాస శుక్లపక్ష ఏకాదశినాడు అంటే ఆదివారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహుని వార్షిక తిరుకల్యాణోత్సవం నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉత్తర రాజగోపురానికి ఎదురుగా ఉన్న సువిశాలమైన ప్రాంగణంలో ప్రత్యేక వేదికను నిర్మించారు. వార్షిక కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు కొట్నాల ఉత్సవం, సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు ఆరాధనం, విశేషహోమాలు, గ్రామబలిహరణం, ధ్వజారోహణం, రాత్రి 6.30 నుంచి 7.30 గంటల వరకు ఎదురు సన్నాహోత్సవం, తిరువీధి సేవ, 8.30 నుంచి 9.30 గంటల వరకు రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 10.30 గంటలకు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభం అవుతుంది. కల్యాణోత్సవ ఏర్పాట్లపై కార్యనిర్వాహణాధికారి జల్లెపల్లి వెంకటరావు మాట్లాడుతూ సుమారు 15 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు తగ్గట్టుగా అన్న ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. కల్యాణం అనంతరం భక్తులకు ఉచితంగా తలంబ్రాలను ప్రస్తుత ప్రసాదాల విక్రయ కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు దర్శనాలు నిలుపుదల చేస్తున్నామన్నారు.
వచ్చే నెలలో సమతా ఎక్స్‌ప్రెస్ రద్దు
విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): సౌత్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలో నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో విశాఖపట్నం-నిజాముద్దీన్ మధ్య రాకపోకలు సాగిస్తున్న సమతా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఏప్రిల్ ఐదో తేదీ నుంచి కొన్ని తేదీల్లో రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. విశాఖ-నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ (12807)ను ఏప్రిల్ 5, 7, 8, 9, 11, 12, 14, 15, 16, 18, 19, 21, 22, 23 తేదీల్లో, నిజాముద్దీన్-విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్ (12708)ను ఏప్రిల్ 7, 9, 10, 11, 13, 14, 16, 17, 18, 20, 21, 23, 24, 25 తేదీల్లో రద్దు చేసినట్టు పేర్కొన్నారు.
బస్‌స్టేషన్ టు సీఎం డాష్‌బోర్డు
ఫీడ్‌బ్యాక్ స్కానర్లు ఏర్పాటు
సమస్యలు తెలియజేయవచ్చు
సలహాలు, సూచనలు నేరుగా పంపించవచ్చు
ద్వారకా బస్‌స్టేషన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ విశాఖ రీజియన్‌లోని ప్రధాన కాంప్లెక్సుల్లో ఫీడ్‌బ్యాక్ స్కానర్లు ఏర్పాటయ్యాయి. రవాణా సేవలు మరింత మెరుగుపరిచేందుకు, ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం వీటిని ఏర్పాటుచేయించింది. రీజియన్ యాజమాన్యం ద్వారకా బస్‌స్టేషన్, మద్దిలపాలెం, గాజువాక, సింహాచలం కాంప్లెక్సుల్లో నాలుగేసి చోట్ల (టికెట్ కౌంటర్, ప్లాట్‌ఫారం, కమర్షియల్ ఏరియా, లాజిస్టిక్స్ కార్యాలయం) ఈ స్కానర్లు ఏర్పాటుచేసింది. ఆ స్కానర్‌ను సెల్‌ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే టెక్స్‌ట్ మెసేజ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఆర్టీసీ వినియోగదారులు బస్సుల నిర్వహణ, సమయపాలన, సిబ్బంది పనితీరు, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఈ టెక్స్‌ట్ ఆప్షన్‌లో టైప్ చేసి ఫార్వర్డ్ చేస్తే...నేరుగా సీఎం డాష్ బోర్డు, ఆర్టీసీ ప్రధాన కార్యాలయం అధికారులకు చేరుతుంది. దానిని వారు గమనించి తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. స్థానిక బస్ స్టేషన్‌లలో అధికారులకు ఫిర్యాదు చేసినా, సూచనలు చేసినా వారు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఈ ఫీడ్‌బ్యాక్ స్కానర్లు ఏర్పాటుచేసింది.
విమాన సర్వీస్‌ల వేళల్లో మార్పులు
గోపాలపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగించే పలు విమానాల వేళల్లో ఆదివారం నుంచి మార్పులు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అబుదాబి-విశాఖ-అబుదాబి విమాన సర్వీస్ ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నం వచ్చి, తిరిగి 10 గంటలకు అబుదాబి బయలుదేరుతుంది. అదేవిధంగా సింగపూర్-విశాఖ-సింగపూర్ విమాన సర్వీస్ రాత్రి 10.50 గంటలకు విశాఖ వచ్చి తిరిగి 11.35 గంటలకు సింగపూర్ బయలుదేరి వెళుతుంది. బెంగళూరు-విశాఖ-బెంగళూరు విమానం వేళలు మార్చి 29 నుంచి ఏప్రిల్ 14 వరకూ మార్పు చేశారు. ఈ విమానం ఉదయం 7.30 గంటలకు విశాఖ వచ్చి, తిరిగి ఎనిమిది గంటలకు బెంగళూరు బయలుదేరి వెళుతుంది. అండమాన్-విశాఖ-బెంగళూరు విమాన వేళలు మార్చి 29 నుంచి ఏప్రిల్ 14 వరకూ మార్చారు. ఈ విమానం అండమాన్ నుంచి మధ్యాహ్నం 12.55 గంటలకు విశాఖ వచ్చి, తిరిగి 1.30 గంటలకు బెంగళూరు బయలుదేరి వెళుతుంది. భువనేశ్వర్-విశాఖ-భువనేశ్వర్ విమాన వేళలు మార్చి 29 నుంచి జూన్ 12 వరకూ మార్పు చేశారు. ఈ విమానం సాయంత్రం 6.20 గంటలకు విశాఖ వచ్చి తిరిగి రాత్రి 6.50 గంటలకు భువనేశ్వర్ బయలుదేరి వెళుతుంది. ఢిల్లీ-విశాఖ-ఢిల్లీ విమాన వేళలు మార్చి 29 నుంచి అక్టోబరు 24 వరకూ మార్పు చేశారు. ఈ విమానం రాత్రి 8.50 గంటలకు విశాఖ వచ్చి తిరిగి 9.30 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళుతుంది.
రాయ్‌పూర్ విమానం రద్దు
విమాన సంస్థలు విశాఖ విమానాశ్రయం నుంచి నడిపే విమానాలకు వేసవి షెడ్యూల్‌ను ప్రకటించాయి. ఆదివారం నుంచి అమలులోకి వచ్చే ఈ షెడ్యూల్ ప్రకారం విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు నడుస్తున్న విమాన సర్వీసు రద్దు అయిపోయింది. సరైన డిమాండ్ లేని కారణంగా రద్దయినట్టు చెబుతున్నారు. ఇకపోతే విశాఖ నుంచి భువనేశ్వర్‌కు రెగ్యులర్‌గా నడుస్తున్న విమానాన్ని వారానికి నాలుగు రోజులే నడపనున్నట్టు పేర్కొన్నారు. విశాఖ నుంచి ముంబై వెళ్లే విమానం ఇకపై నవీ ముంబై విమానాశ్రయానికి వెళ్లనుంది. టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు నవీ ముంబై అని వెదికితేనే వెబ్‌సైట్‌లో దొరుకుతుందని ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయమోహన్ తెలిపారు.