Share News

నేడే రెండో దశ పల్లె పోరు

ABN , Publish Date - Nov 29 , 2026 | 12:01 AM

జిల్లాలో రెండో విడతగా పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగులలో ఆదివారం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడే రెండో దశ పల్లె పోరు
అనంతగిరి : పోలింగ్‌ సామగ్రిని తీసుకునేందుకు వచ్చిన ఎన్నికల సిబ్బంది

పెదబయలు, ముంచంగిపుట్టు,

అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో ఎన్నికలు

సర్పంచులుగా 452 మంది, వార్డు సభ్యులుగా 1,202 మంది పోటీ

బరిలో టీడీపీ మద్దతుతో 87, వైసీపీ 87, జనసేన 18,

బీజేపీ 26, ఇతరులు 234 మంది సర్పంచ్‌ అభ్యర్థులు

ఎన్నికల సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సిబ్బంది

(పాడేరు - ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రెండో విడతగా పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగులలో ఆదివారం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల కేంద్రాల్లో శనివారం ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్లు, ఇతర సామగ్రిని అందించి, ప్రత్యేక వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల సిబ్బంది శనివారం రాత్రి పోలింగ్‌ కేంద్రాల్లోనే బస చేసి ఆదివారం తెల్లవారుజామున 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభించి 1 గంట వరకు నిర్వహిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి సర్పంచ్‌, వార్డు స్థానాల్లోని విజేతలను ప్రకటిస్తారు, అనంతరం ఉపసర్పంచ్‌ల ఎన్నికల చేపడతారు. ఈ నాలుగు మండలాల్లోని 87 పంచాయతీల్లో సర్పంచులకు 452 మంది, 530 వార్డు స్థానాలకు 1,202 మంది మొత్తం 1,654 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ముంచంగిపుట్టులో 38,895 మంది, పెదబయలులో 43,322, అనంతగిరిలో 38,286, జి.మాడుగులలో 44,674 మంది ఓటర్లున్నారు. రెండో విడత ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి, జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌, ఇతర అధికారులు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌ నిషాంతి

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలను పకడ్బంధీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని, అదే స్ఫూర్తితో ముంచంగిపుట్టు, పెదబయలు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో రెండో విడత పంచాయతీల ఎన్నికలను నిర్వహించాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరించి ఎన్నికలను సజావుగా నిర్వహించాలన్నారు. పోలింగ్‌, కౌంటింగ్‌, ఫలితాలు వెల్లడి ప్రక్రియలను పక్కాగా చేపట్టాలన్నారు. ఈక్రమంలో ఎటువంటి పొరపాట్లు, సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. రెండో విడతలో నాలుగు మండలాల్లో 87 పంచాయతీలు, 452 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. పోలింగ్‌ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు యంత్రాంగానికి సంపూర్ణంగా సహకరించాలని కలెక్టర్‌ నిషాంతి పేర్కొన్నారు.

Updated Date - Nov 29 , 2026 | 12:01 AM