రైతు గుర్తింపు నమోదుకు నేటి తుది గడువు
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:49 AM
విశిష్ట రైతు గుర్తింపు నమోదుకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. శనివారం సాయంత్రంలోగా రైతులు రిజిస్ర్టేషన్ పూర్తిచేయించుకోవాలని, లేకపోతే వ్యవసాయ సంబంధిత సంక్షేమ పథకాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు అందవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
‘విశిష్ట’ కార్డు లేకపోతే పథకాలు కట్
పేర్లు నమోదు చేసుకోవాల్సిన రైతులు 38,288 మంది
నర్సీపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): విశిష్ట రైతు గుర్తింపు నమోదుకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. శనివారం సాయంత్రంలోగా రైతులు రిజిస్ర్టేషన్ పూర్తిచేయించుకోవాలని, లేకపోతే వ్యవసాయ సంబంధిత సంక్షేమ పథకాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు అందవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా విశిష్ట గుర్తింపు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎం.ఆశాదేవి అంటున్నారు. లేకపోతే పీఎం కిసాన్ యోజన, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న అన్నదాత సుఖీభవ పథకం, పంటనష్ట పరిహారం, రైతు బీమా పథకం, బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకి పంట రుణాలు వంటివి అందవు. ఒక రైతుకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాసరే 11 అంకెలతో ఉన్న రైతు గుర్తింపు నంబరు ఆధారంగా భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. వివిధ ప్రాంతాల్లో ఉన్న భూ ఖాతా వివరాలన్నీ ఇందులో పొందుపరుస్తారు. భవిష్యత్తులో యూనిక్ ఐడీ అనేది రైతులకు చాలా ప్రయోజనాలు చేకూర్చుంది. రైతు సంక్షేమ పథకాలన్నీ పారదర్శకంగా అమలు చేయడానికి ఉపయోగ పడుతుంది.
వ్యవసాయ, రెవెన్యూ శాఖల గణాంకాల ప్రకారం జిల్లాలో 2,40,300 మంది రైతులు వున్నారు. వీరిలో పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు 1,91,277 మంది ఉన్నారు. 11 అంకెలతో కూడిన విశిష్ట రైతు గుర్తింపు కార్డు కోసం నమోదు చేసుకున్న పీఎం కిసాన్ లబ్ధిదారులు 1.52,989 మంది ఉన్నారు. ఇంకా 38,288 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఒక్క రోజు మాత్రమే గడువు ఉండడంతో వ్యవసాయ అధికారులు, ఆయా రైతుల మొబైల్‌ఫోన్లకు ప్రత్యేకంగా లింకులు పంపించి నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్‌కి అనుసంధానం చేసిన ఫోన్ నంబరుతో దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళితే అక్కడ గ్రామ వ్యవసాయ సహాయకులు రైతు నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు.
తప్పని సరిగా నమోదు చేసుకోవాలి
ఎం.ఆశాదేవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
రైతులందరూ విశిష్ట గుర్తింపు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి. లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి. ఫోన్ నంబరుతో ఆనుసంధానం చేసిన ఆధార్ జెరాక్స్, పట్టాదారు పాసుపుస్తకం తీసుకొని దగ్గరలోని రైతు సేవా కేంద్రాలకు వెళితే అక్కడ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేస్తారు.