నేడే శతాబ్ది వేడుక
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:03 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు భారీ ఏర్పాట్లు జరిగాయి.
ఏయూ ఉత్సవాల ముగింపు సభకు సర్వం సిద్ధం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గౌరవ అతిథిగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్
విశిష్ట అతిథులుగా గవర్నర్ అబ్దుల్‌నజీర్, సీఎం చంద్రబాబునాయుడు, ఇతర ప్రముఖులు
సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఇంజనీరింగ్ కళాశాల మైదానం
విశాఖపట్నం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించే సభకు ప్రధాన వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సభకు సుమారు 25వేల మంది హాజరుకానున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తిచేశారు. ముగింపుసభకు ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గౌరవ అతిథిగా ప్రముఖ మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ హాజరుకానున్నారు. విశిష్ట అతిథులుగా గవర్నర్ అబ్దుల్‌నజీర్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పూర్వ విద్యార్థులు గ్రంథి మల్లికార్జునరావు, బీవీఆర్ మోహన్‌రెడ్డి, డాక్టర్ చావ సత్యనారాయణ తదితరులు హాజరుకానున్నారు.
మధ్యాహ్నం రెండు గంటలకు ముగింపుసభకు ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగంతోపాటు వర్సిటీ అధికారులు భారీగా కసరత్తు చేశారు. సభకు హాజరయ్యేందుకు వీలుగా విద్యార్థులు, పూర్వ విద్యార్థుల రిజిస్ర్టేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సుమారు 25 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, వర్సిటీ ఉద్యోగులు, అనుబంధ కళాశాలలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సీటింగ్ ఎరేంజ్‌మెంట్స్ పూర్తయ్యాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రాంగణంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను ప్రారంభిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాన కార్యక్రమం ప్రారంభమవుతుందని వర్సిటీ అధికారులు వివరించారు. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకోవడంతోపాటు పూర్వ విద్యార్థుల్లో ప్రముఖులైన తొమ్మిదిమందిని ఘనంగా సత్కరించనున్నారు.
ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సమీక్షించారు. వీసీ జీపీ రాజశేఖర్, ఇతర అధికారులతో ఆదివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలిచ్చారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రొగ్రామ్ మినిట్ టూ మినిట్ షెడ్యూల్‌కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. మెమెంటోల బహూకరణతోపాటు ఇతర కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.45 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గ్రీన్‌రూమ్‌లో అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు గ్యాలరీల్లో తాగునీటి సీసాలు, జీవీఎంసీ ద్వారా 25 వేల లీటర్ల నీటి టిన్నులతో టేబుల్స్ ఏర్పాటుచేయాలన్నారు. గ్యాలరీల్లో అందరికీ స్నాక్స్ అందేలా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్ ఏర్పాట్లు కచ్చితంగా ఉండాలని, కమాండ్ కంట్రోల్‌రూమ్ లో అన్నివిభాగాల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఎంవోయూలు, సత్కార కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలన్నారు.
వీవీఐపీల కోసం అత్యాధునిక సుదపాయాలు కలిగిన అం బులెన్స్‌లు, కంటింజెంట్ ఆస్పత్రులు సిద్ధంగా ఉంచాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, స్ట్రక్చరల్ పనులు, ఫైర్ సేఫ్టీ చర్యలతోపాటు ఫైర్ టెండర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. కాన్వాయ్ ఇన్‌చార్జి ఏర్పా ట్లను పర్యవేక్షించాలని, రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రధాన విభాగాల అధి కారులకు వైర్‌లెస్ సెట్స్ అందించాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. అంతకుముందు జేసీ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి ప్రధాన వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.