నేడు మోదకొండమ్మ అనుపోత్సవం
ABN , Publish Date - May 19 , 2026 | 12:12 AM
మన్యం వాసుల ఆరాధ్య దేవతపాడేరు మోదకొండమ్మ అమ్మవారి అనుపోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా ముగింపు రోజైన మంగళవారం ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఉత్సవాల ఆఖరి రోజున వైభవంగా ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు
హాజరుకానున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు
పాడేరు, మే 18 (ఆంధ్రజ్యోతి): మన్యం వాసుల ఆరాధ్య దేవతపాడేరు మోదకొండమ్మ అమ్మవారి అనుపోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా ముగింపు రోజైన మంగళవారం ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
తొలి రోజు ఆలయం నుంచి ఊరేగింపుగా శతకంపట్టులో కొలువు తీర్చిన అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలును అనుపోత్సవంలో భాగంగా తిరిగి ఆలయంలో అనుపు తీర్చే తంతును మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తొలి రోజుకు మించి ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. రకరకాల నృత్యాలు, వేషాలు, డప్పుల వాయిద్యాల సందడి వాతావరణంలో ఉత్సవ మూర్తిని, పాదాలును ఊరేగిస్తారు. అనుపోత్సవం ముగిసిన తరువాత భారీగా బాణసంచా కాలుస్తారు. మంగళవారం రాత్రంతా భక్తులను అలరించేందుకు సినీ, టీవీ, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రాత్రంతా ఆయా కార్యక్రమాలను తిలకించి బుధవారం నుంచి భక్తులు స్వస్థలాలకు తిరుగు ప్రయాణమవుతారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పలువురు ఎమ్మెల్యేల రాక
మోదకొండమ్మ ఉత్సవాల ముగింపు రోజున జరిగే అనుపోత్సవానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వస్తారని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఆఖరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.
ఉత్సవాల రెండో రోజు పోటెత్తిన జనం
స్థానిక మోదకొండమ్మ ఉత్సవాల రెండో రోజైన సోమవారం జనం పొటెత్తారు. వివిధ ప్రాంతాలకు చెందిన జనం ఉత్సవాల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సోమవారం సాయంత్రం నుంచే పుర వీధులు జనంతో కిటకిటలాడాయి. ఈ ఏడాది విద్యుద్దీపాలంకరణ ఆకర్షణీయంగా ఉండడంతో వాటిని తిలకించేందుకు అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. సాయంత్రం పట్టణ వీధుల్లో నేల వేషాలు, తీన్‌మార్, ఓనం బ్యాండ్ మోతలతో దద్దరిల్లింది.