నేడు పెందుర్తి ఎంపీపీపై అవిశ్వాసం
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:27 AM
పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ) మధుపాడ నాగమణి సోమవారం అవిశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు.
ఉదయం 11 గంటలకు సమావేశం
చేతులు ఎత్తడం ద్వారా ప్రక్రియ
ఏడుగురు సభ్యుల సంతకాలతో గత నెల ఆర్డీవోకు నోటీసు
పెందుర్తి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ) మధుపాడ నాగమణి సోమవారం అవిశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే ఎంపీటీసీ సభ్యులకు సమాచారం అందజేశారు. మొత్తం 9 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఏడుగురు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి గత నెల 19న ఆర్డీవోకు అందజేశారు. చేతులు ఎత్తడం ద్వారా అవిశ్వాస తీర్మానంపై ఎన్నిక నిర్వహిస్తారు.
కాగా అవిశ్వాసం ప్రకటించిన ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుతం ఊటీలో ఉన్నారని సమాచారం. వారంతా సోమవారం ఉదయం పెందుర్తి చేరుకుని, నేరుగా సమావేశానికి హాజరవుతారని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎన్నికైన మధుపాడ నాగమణి ఎంపీపీగా ఉన్నారు. ఆమె అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.
ఇదీ అవిశ్వాసం తీరు...
పెందుర్తి మండలంలో మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలుండగా, 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి మఽఽధుపాడ నాగమణి (ఎస్‌ఆర్‌పురం), గొల్లవిల్లి రమణ ( సరిపల్లి), దాడి వరలక్ష్మి (పినగాడి), చిరికి దేవుడు (గొరపల్లి), నందవరపు అప్పలరాజు (పెదగాడి), గండి హిమబిందు (రాంపురం), సైపురాజు స్వప్న (వాలిమెరక), ముదపాక దేవి (రాజయ్యపేట), టీడీపీ నుంచి గండ్రెడ్డి మాలతి (గుర్రమ్మపాలెం) విజయం సాధించారు. మెజారిటీ సభ్యులు వైసీపీ నుంచి ఎంపికవడం, ఎంపీపీ పదవి మహిళకు రిజర్వు కావడంతో ఎస్‌ఆర్‌పురం ఎంపీటీసీ సభ్యురాలు మధుపాడ నాగమణి ఎంపీపీగా ఎన్నికయ్యారు. కాగా గత సాధారణ ఎన్నికల తరువాత మండలంలో మారిన రాజకీయ సమీకరణాల మేరకు వైసీపీ నుంచి ఎంపికైన ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు కూటమికి మద్దతుగా నిలిచారు. ఈ మేరకు గతనెల 19న విశాఖ ఆర్డీవోకు అవిశ్వాస తీర్మానంపై నోటీసు అందజేశారు.
నవోదయ విద్యాలయంలో కలకలం
దోమల నివారణకు జీవీఎంసీ సిబ్బంది ఫాగింగ్
పొగను పీల్చిన 36 మంది విద్యార్థులకు అస్వస్థత
కొమ్మాది, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి):
కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం సాయంత్రం తీవ్ర కలకలం రేగింది. దోమల నివారణ కోసం జీవీంఎఈసీ సిబ్బంది చేపట్టిన ఫాగింగ్ (పొగ) వికటించి, సుమారు 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి...
దోమల నియంత్రణలో భాగంగా జీవీఎంసీ సిబ్బంది శనివారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఫాగింగ్ యంత్రాలతో చర్యలు చేపట్టారు. పొగను పీల్చిన విద్యార్థులు ఊపిరి ఆడకపోవడంతో అస్వసతకు గురయ్యారు. కొద్దిసేపటికే శ్వాస కోస సమస్యలు కళ్లు తిరగడం, వాంతులు ప్రారంభమయ్యాయి. వారిని పాఠశాల సిబ్బంది వెంటనే కొమ్మాది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకూ అత్యవసర చికిత్స అందించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యార్థులంతా గదుల్లో ఉన్న సమయంలోనే ఫాగింగ్ చేయడంపై వారి తల్లిదండ్రులు,స్థానికులు మండిపడుతున్నారు.