Share News

పాతాళానికి భూగర్భ జలాలు

ABN , Publish Date - Jul 30 , 2026 | 01:24 AM

కైలాసగిరి, కంబాలకొండ మధ్య గల ఆరిలోవలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ముడసర్లోవ రిజర్వాయర్‌ కలిగిన ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఏకంగా 36.25 మీటర్లకు పడిపోయాయి. గత నెలలో 28.7 మీటర్ల లోతున ఉన్నాయి. నెలరోజుల వ్యవధిలో 6.55 మీటర్ల మేర తగ్గాయి. గత సంవత్సరం జూలైలో 24.53 మీటర్లు ఉండగా, ఈ ఏడాది ఏకంగా 36.25 మీటర్లకు తగ్గడంతో ఆరిలోవ ప్రస్తుతం అత్యంత నీటి ఎద్దడి కలిగిన ప్రాంతంగా మారింది. వర్షాలు లేకపోవడం, హెల్త్‌ సిటీలో ఉన్న ఆస్పత్రులు ఇష్టానుసారంగా వందల అడుగుల లోతుకు బోర్లు వేసి నీరు తోడేస్తుండడంతో ప్రస్తుతం భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లిపోయాయి. వర్షాలు ఆదుకోకపోతే భవిష్యత్తులో ఆరిలోవ రెడ్‌జోన్‌లోకి వెళుతుందని భూగర్భ జల నిపుణుడు ఒకరు హెచ్చరించారు.

పాతాళానికి  భూగర్భ జలాలు

ఆరిలోవలో మరీ ఆందోళనకర పరిస్థితులు

36.25 మీటర్ల లోతుకు పడిపోయిన మట్టాలు

ఎండాడలో 30.86,

మధురవాడలో 27.23 మీటర్లకు...

నైరుతి సీజన్‌లో విశాఖ రూరల్‌

మండలంలో 72 శాతం లోటు వర్షపాతం

ఆగస్టులోనైనా కురవకుంటే కష్టమే

విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):

కైలాసగిరి, కంబాలకొండ మధ్య గల ఆరిలోవలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ముడసర్లోవ రిజర్వాయర్‌ కలిగిన ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఏకంగా 36.25 మీటర్లకు పడిపోయాయి. గత నెలలో 28.7 మీటర్ల లోతున ఉన్నాయి. నెలరోజుల వ్యవధిలో 6.55 మీటర్ల మేర తగ్గాయి. గత సంవత్సరం జూలైలో 24.53 మీటర్లు ఉండగా, ఈ ఏడాది ఏకంగా 36.25 మీటర్లకు తగ్గడంతో ఆరిలోవ ప్రస్తుతం అత్యంత నీటి ఎద్దడి కలిగిన ప్రాంతంగా మారింది. వర్షాలు లేకపోవడం, హెల్త్‌ సిటీలో ఉన్న ఆస్పత్రులు ఇష్టానుసారంగా వందల అడుగుల లోతుకు బోర్లు వేసి నీరు తోడేస్తుండడంతో ప్రస్తుతం భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లిపోయాయి. వర్షాలు ఆదుకోకపోతే భవిష్యత్తులో ఆరిలోవ రెడ్‌జోన్‌లోకి వెళుతుందని భూగర్భ జల నిపుణుడు ఒకరు హెచ్చరించారు.

ప్రస్తుతం భూగర్భ జలాలు ఎండాడలో 30.86 మీటర్లు (గత నెలలో 30.37 మీటర్లు), మధురవాడలో 27.23 (గత నెలలో 27.06 మీటర్లు), పెదరుషికొండలో 24.12 (గత నెల 22.84 మీటర్లు) మీటర్లకు పడిపోయాయి. ఇంకా శివాజీపాలెంలో 15.78, కణితి కాలనీలో 13.14, సెంట్రల్‌పార్కు వద్ద 16.18 మీటర్ల లోతున ఉన్నాయి. గత ఏడాది జూలైలో ఎండాడలో 20.95, మధురవాడలో 22.85, పెదరుషికొండలో 17.61, శివాజీపాలెంలో 11.17, కణితి కాలనీలో 14.87, సెంట్రల్‌ పార్కు వద్ద 13.93 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది మరింత లోతుకు పడిపోయాయి. నగరంలో ముఖ్యంగా ఆరిలోవ, ఎండాడ, మధురవాడ, పరిసర ప్రాంతాల్లో ఆవాసాలు పెరగడంతో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతోంది.

నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూన్‌ ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు జిల్లాలో 230.1 మి.మీ.కు గాను 78.7 (65.8 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్‌ మండలంలో 226.5 మి.మీ.కుగాను 78.3 (72 శాతం తక్కువ) మి.మీ.వర్షపాతం నమోదైంది. గోపాలపట్నం మండలంలో 80.4, ములగాడలో 78.3, గాజువాకలో 69 శాతం, పెదగంట్యాడలో 82 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

ఆగస్టులోనైనా వర్షాలు కురవకపోతే నగరంలో నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాల సంఖ్య మరింత పెరగనున్నది. ప్రస్తుతం నగరంలోని అనేక ప్రాంతాల్లో అపార్టుమెంట్లలో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. వర్షాకాలంలోనే ఇలా ఉంటే...వచ్చే ఏడాది వేసవిలో పరిస్థితి మరింత ఆందోళనంగా ఉంటుందని భూగర్భ జల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నగరం, పరిసరాల్లో వర్షపు నీటిని కాపాడే యంత్రాంగం ఏటా తగ్గుతుంది. వర్షపు నీరు సముద్రంలోకి వెళ్లడం తప్ప భూమిలోకి ఇంకే మార్గాలు తక్కువగా ఉన్నాయి. ఇంకా ప్రజలు వాడే నీటిని రీసైకిల్‌ చేసే విధానం కూడా నగరంలో లేదు. దీంతో భూగర్భ జలాలపై మరింత ఒత్తిడి పెరుగుతోంది.

Updated Date - Jul 30 , 2026 | 01:24 AM