పచ్చదనం పరిఢవిల్లేలా..
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:07 AM
వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పచ్చదనం అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ ద్వారా విత్తన బంతులు(సీడ్ బాల్స్)ను వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలో అటవీశాఖ అధికారులు లక్ష్యాన్ని మించి విత్తన బంతులు వెదజల్లారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం 7 లక్షలు కాగా, 8.2 లక్షలకు పైగా సీడ్ బాల్స్ వెదజల్లారు.
- జిల్లాలో 8.2 లక్షల విత్తన బంతులను వెదజల్లిన అటవీశాఖ
- నిర్దేశించిన లక్ష్యం 7 లక్షలు కాగా, అంతకు మించి వెదజల్లిన వైనం
- ముందంజలో నర్సీపట్నం రేంజ్
నర్సీపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పచ్చదనం అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ ద్వారా విత్తన బంతులు(సీడ్ బాల్స్)ను వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలో అటవీశాఖ అధికారులు లక్ష్యాన్ని మించి విత్తన బంతులు వెదజల్లారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం 7 లక్షలు కాగా, 8.2 లక్షలకు పైగా సీడ్ బాల్స్ వెదజల్లారు.
జిల్లాలోని ఐదు రేంజ్‌ల పరిధిలో 78,300 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. మానవ తప్పిదాల కారణంగా అడవులు అంతరించిపోతున్నాయి. మానవ అవసరాల కోసం విచ్చలవిడిగా చెట్లు నరికివేయడంతో దాని ప్రభావం వాతావరణం మీద పడుతోంది. పచ్చదనం కనుమరుగు అవుతుండడంతో వాతావరణం సమతుల్యత దెబ్బతిని ఎండా కాలంలో వర్షాలు, వర్షా కాలంలో తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సాగు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైన విషయం తెలిసింది. రిజర్వాయర్లు, సాగునీటి చెరువులు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నర్సీపట్నం రేంజ్ ముందంజ
జిల్లాలో నర్సీపట్నం, కేడీపేట, ఎలమంచిలి, చోడవరం, అనకాపల్లి రేంజ్‌లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 2.2 లక్షల విత్తన బంతులు వెదజల్లి నర్సీపట్నం రేంజ్ ముందు వరుసలో ఉంది. మిగిలిన రేంజ్‌లలో ఇచ్చిన లక్ష్యం మేరకు 1.6 లక్షలు చొప్పున సీడ్ బాల్స్ తయారు చేశారు. వీటిని అటవీ ప్రాంతాలోని ఖాళీ ప్రదేశాలలో విసిరారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం 7 లక్షలు కాగా, 8.2 లక్షలకు పైగా సీడ్ బాల్స్ వెదజల్లడం విశేషం. ఇందుకు రూ.16 లక్షల నిధులు వెచ్చించారు. వచ్చే ఏడాది వర్షా కాలంలో మళ్లీ సీడ్ బాల్స్ కార్యక్రమం చేపడతామని జిల్లా అటవీ అధికారి శామ్యూల్ తెలిపారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం
మొక్క నాటి నీరు పోసి సంరక్షించడానికి ఒక్కొక్క దానికి రూ.40లు ఖర్చు అవుతుంది. సీడ్ బాల్‌కి రూ.2లు మాత్రమే ఖర్చు అవుతుంది. అంకుడు, వేప, నేరేడు, తెల్ల మద్ది, నల్ల మద్ది, మర్రి, రావి, కానుక విత్తనాలు ఉపయోగించారు. 30 శాతం మట్టి, 70 శాతం ఆవుపేడ, బూడిద, విత్తనాలు కలిపి బంతులుగా తయారు చేసి ఎండబెట్టారు. బంతి పైభాగంలో ఉన్న మట్టి పక్షులు, క్రిమికీటకాల నుంచి విత్తనాలను కాపాడుతుంది. వర్షం కురిసినప్పుడు మట్టి మెత్తబడి సులభంగా విత్తనాలు మొలకెత్తుతాయి. మిశ్రమంలో కలిపిన ఆవు పేడ కంపోస్ట్ ఎరువుగా పని చేస్తుంది. విత్తన బంతులు ఖాళీ ప్రదేశాలు, అటవీ ప్రాంతాలల్లో వెదజల్లడం ద్వారా పచ్చదనం అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డ్రోన్‌లు ఉపయోగించి సీడ్ బాల్స్ వెదజల్లారు.