వసతి గృహాలను చక్కదిద్దేలా...
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:12 AM
వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది.
పరిస్థితులను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరణ
మెనూ అమలు, వార్డెన్ పనితీరు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణపై ఆరా
రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచిన జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్
14వ స్థానంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్స్
ఆకస్మిక తనిఖీలు, విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారుల సమావేశాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సమాచారాన్ని సేకరించి జిల్లాల వారీగా ప్రతి నెలా ర్యాంకులను విడుదల చేస్తోంది. ప్రధానంగా మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా?, హాస్టల్ వార్డెన్ పనితీరుపై మీరు సంతృప్తిగా ఉన్నారా?, హాస్టల్‌లో తాగునీరు, పారిశుధ్య నిర్వహణపై సంతృప్తిగా ఉన్నారా?...అనే వివరాలు తెలుసుకుంటోంది.
టాప్‌లో ఎస్సీ హాస్టల్స్...మెరుగు దిశగా బీసీ
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 23 హాస్టళ్లు ఉండగా, రెండు వేల మంది విద్యార్థులు ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 28 హాస్టళ్లు ఉండగా, మూడు వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా హాస్టళ్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సేకరించిన అభిప్రాయాలను బట్టి జనవరి నెలలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలవగా, బీసీ సంక్షేమ శాఖ 18వ స్థానంలో ఉంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మరోసారి తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 76.8 శాతం సంతృప్తి స్థాయితో కృష్ణా జిల్లాతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇకపోతే, బీసీ సంక్షేమ శాఖ 75.6 శాతంతో 14వ స్థానాన్ని దక్కించుకుంది. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి చినగదిలి, గాజువాక, భీమిలి హాస్టళ్లలో వార్డెన్‌ల పనితీరు, మెనూ పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తంచేశారు. బీసీ సంక్షేమశాఖకు చెందిన అనేక హాస్టళ్లలో వార్డెన్ పనితీరు, మెనూ, శానిటేషన్‌పై అసంతృప్తి వ్యక్తం కావడంతో 14వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మెరుగైన ర్యాంకుపై అధికారులు దృష్టి
హాస్టళ్ల వారీగా మార్కులను కేటాయిస్తుండడంతో అసంతృప్తి స్థాయి ఎక్కువ ఉన్న వాటిపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతృప్తికి కారణమవుతున్న వాటిని పరిష్కరించడంపై దృష్టి సారించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.రామారావు తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నామని, హాస్టళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. టాయిలెట్స్‌లో నిరంతరం నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన రూ.36.5 లక్షలతో వసతి గృహాల్లో నెట్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.రాజేశ్వరి మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేశామని, నిత్యం మెనూ ప్రకారం వంటకాలను సిద్ధం చేసి అందులో పోస్టు చేయించేలా చూస్తున్నామన్నారు. వార్డెన్లు అందుబాటులో ఉండాలని, రాత్రిపూట స్టడీ అవర్స్ సరిగా జరిగేలా చూడాలని ఆదేశించినట్టు తెలిపారు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలను తీసుకుంటున్నట్టు తెలిపారు.