Share News

బడికి వెళ్లాలంటే గెడ్డ దాటాల్సిందే..

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:34 AM

మండలంలోని కుంతుర్ల పంచాయతీ పరిధిలోని కన్నెలకట్టు గ్రామానికి చెందిన విద్యార్థులు రోజూ ప్రాణాలకు తెగించి గెడ్డ దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. వారు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

బడికి వెళ్లాలంటే గెడ్డ దాటాల్సిందే..
ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటుతున్న కనె ్నలకట్టు విద్యార్థులు

- కనె ్నలకట్టు గ్రామంలో ఎన్‌ఆర్‌ఎస్‌టీ సెంటర్‌ మూతపడడంతో విద్యార్థులకు కష్టాలు

- ఉధృతంగా ప్రవహించే గెడ్డను దాటి మచ్చుపల్లి పాఠశాలకు..

- పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రుల్లో గుబులు

పెదబయలు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కుంతుర్ల పంచాయతీ పరిధిలోని కన్నెలకట్టు గ్రామానికి చెందిన విద్యార్థులు రోజూ ప్రాణాలకు తెగించి గెడ్డ దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. వారు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

మండలంలోని కుంతుర్ల పంచాయతీ పరిధిలోని కన్నెలకట్టు గ్రామంలో నాన్‌ రెసిడెన్షియల్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) ఉండేది. ఇందులో గ్రామానికి చెందిన 17 మంది విద్యార్థులు ప్రాథమిక విద్య అభ్యసించేవారు. వీరికి వలంటీర్‌ పాఠాలు బోధించేవారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా పెట్టేవారు. అయితే ఈ సెంటర్‌ను ఈ విద్యా సంవత్సరంలో రెన్యువల్‌ చేయకపోవడంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ఈ సెంటర్‌ మూతపడడంతో రోజూ సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రాణాలకు తెగించి గెడ్డలు, వాగులు దాటుకుంటూ మచ్చుపల్లి ఎంపీపీ పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండ డంతో బిక్కుబిక్కుమంటూ పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. దీంతో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి తమ గ్రామంలో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీని పునఃప్రారంభించి పిల్లలకు విద్యను అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:34 AM