తృప్తిగా ఆరగించేలా..
ABN , Publish Date - May 17 , 2026 | 12:32 AM
ఎవరికి వారు తమకు నచ్చిన పదార్థాలను ఎంత కావాలంటే అంత వడ్డించుకుని సంతృప్తిగా తినే క్యాంటీన్ త్వరలో నర్సీపట్నంలో ప్రారంభం కాబోతోంది. కస్టమర్ అరటి ఆకు వేసిన ప్లేటు పట్టుకొని వెళ్లి అక్కడ వరుసగా హాట్ డిష్‌ల్లో ఉంచిన వైట్ రైస్ , కూరలు, సాంబారు, ఫ్రై, పెరుగు కావల్సినంత స్వయంగా వడ్డించుకొని తినొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మునిసిపాలిటీ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్ ఎదురుగా తృప్తి క్యాంటీన్‌లో తొలిసారి అధునాత బఫే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
- బఫే పద్ధతిలో ఎంత కావాలంటే అంత వడ్డించుకునే అవకాశం
- అందుబాటులోకి రానున్న తృప్తి క్యాంటీన్
- మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు
- ప్లాస్టిక్ రహితంగా నిర్వహణ
- నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ప్రారంభానికి సిద్ధం
నర్సీపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి): ఎవరికి వారు తమకు నచ్చిన పదార్థాలను ఎంత కావాలంటే అంత వడ్డించుకుని సంతృప్తిగా తినే క్యాంటీన్ త్వరలో నర్సీపట్నంలో ప్రారంభం కాబోతోంది. కస్టమర్ అరటి ఆకు వేసిన ప్లేటు పట్టుకొని వెళ్లి అక్కడ వరుసగా హాట్ డిష్‌ల్లో ఉంచిన వైట్ రైస్ , కూరలు, సాంబారు, ఫ్రై, పెరుగు కావల్సినంత స్వయంగా వడ్డించుకొని తినొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మునిసిపాలిటీ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్ ఎదురుగా తృప్తి క్యాంటీన్‌లో తొలిసారి అధునాత బఫే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
మహిళలు వ్యాపారవేత్తగా ఎదగడంతో పాటు మరికొంత మందికి జీవనోపాధి కల్పించాన్న ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తృప్తి క్యాంటీన్లు మంజూరు చేస్తోంది. జిల్లాలో తొలిసారి నర్సీపట్నానికి చెందిన ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు మీర్ రహినా భానుకి యూనిట్ మంజూరు అయింది. మెప్మా అధికారులు ఆమెకు రూ.13.75 లక్షలు బ్యాంక్ రుణం ఇప్పించారు. సారా సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు ముందే నిర్దేశించిన డిజైన్‌తో కంటైనరు, వంటశాల సామగ్రి సమకూర్చారు. ఆర్టీసీ కాంప్లెక్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కంటైనర్ ఏర్పాటు చేసి పైన రేకుల షెడ్డు వేశారు.
తృప్తి క్యాంటీన్ స్పెషల్ ఏమిటంటే..
తృప్తి క్యాంటీన్‌లో బేకరీ ఐటెమ్స్, స్వీట్స్, బర్గర్లు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ప్రత్యేకంగా వెజ్, నాన్ విజిటేరియన్ పలావ్ అందుబాటులో ఉంటాయి. మిగిలిన హోటళ్ల కంటే తక్కువ ధరకు నాణ్యమైన, రుచికరమైన అల్పాహారం, భోజనం అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే క్యాంటీన్ ప్లాస్టిక్ రహితంగా నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. చాలా హోటళ్లలో వేడి వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ పేపరు వేసి ప్లేట్లలో వడ్డిస్తారు. ఇక్కడ ప్లేటులో అరిటి ఆకు వాడతారు. టీ, కాఫీకి స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. త్వరలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.