బోసిపోయిన అనకాపల్లి
ABN , Publish Date - Jan 17 , 2026 | 01:06 AM
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు వెళ్లడంతో ఆ ప్రభావం అనకాపల్లి పట్టణంపై పడింది. మూడు రోజుల నుంచి ప్రధాన రహదారుల్లో జనసంచారం, వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి.
రహదారులపై తగ్గిన జనసంచారం, వాహనాల రాకపోకలు
అత్యధిక వ్యాపార సంస్థలు మూసివేత
ప్రయాణికులు లేక వెలవెలబోయిన ఆర్టీసీ కాంప్లెక్స్
అనకాపల్లి టౌన్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు వెళ్లడంతో ఆ ప్రభావం అనకాపల్లి పట్టణంపై పడింది. మూడు రోజుల నుంచి ప్రధాన రహదారుల్లో జనసంచారం, వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. చాలా మంది వ్యాపారులు గురువారం మధ్యాహ్నం తరువాత షాపులను మూసేశారు. కనుమ పండుగ కావడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అంతగా వచ్చే అవకాశం లేకపోవడంతో శుక్రవారం కూడా చాలా వరకు దుకాణాలు మూసేవున్నాయి.
జిల్లాలోని పలు మండలాలకు చెందిన వివిధ వర్గాల ప్రజలు అనకాపల్లిలో ఉపాధి, ఉద్యోగం, వ్యాపారాలు చేస్తుంటారు. ఇంకా పలువురు ఉన్నత విద్యను అభ్యసిస్తుంటారు. ఇంకా రోజూ చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి వివిధ పనులు, అవసరాల నిమిత్తం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే సంక్రాంతి పండుగ కావడంతో ఇక్కడకు వలస వచ్చిన వారు రెండు, మూడు రోజుల ముందే సొంతూళ్లకు వెళ్లిపోయారు. పండుగకు అవసరమైన దుస్తులు, నిత్యావసర సరకులు, ఇతర సామగ్రిని భోగి పండుగకన్నా ముందే కొనుగోలు చేశారు. దీంతో గురువారం ఉదయం నుంచే పట్టణంలో ట్రాఫిక్ తగ్గింది. ప్రధాన రహదారులతోపాటు వీధుల్లో సైతం వాహనాల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం పలు వీధులు నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ శుక్రవారం నిర్మానుష్యంగా మారింది. పాసింజరు బస్సులు ఆగే ప్రదేశంలో అరకొరగా ప్రయాణికుల సంఖ్య ఉన్నప్పటికీ ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగేచోట ప్రయాణికులు లేక వెలవెలబోయింది. సాయంత్రం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.