సకాలంలో సమస్యలకు పరిష్కారం
ABN , Publish Date - Jun 05 , 2026 | 10:15 PM
పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 107 వినతులు స్వీకరణ
అర్జీదారుల ఉచిత భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ నిషాంతి
పాడేరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో ఆమెఅధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అర్జీదారులు సమర్పించిన వినతులను పక్కాగా పరిశీలించి, వాటికి శాశ్వత పరిషారం చూపాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు ప్రతి శాఖకు చెందిన జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని, ఏదైనా కారణంతో హాజరు కాలేకపోతే ముందస్తు అనుమతి పొందాలన్నారు. ప్రతి రోజూ సచివాలయాల్లోనూ ప్రజల నుంచి వినతులను స్వీకరించాలని ఆమె సూచించారు. భూ సంబంధ సమస్యలపై ఫిర్యాదులు వస్తే సంబంధిత భూమి వద్దకు వెళ్లి పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో సమర్పించిన అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునే ందుకు 1100 నంబర్ కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ సూచించారు. కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు గిరిజనుల నుంచి 107 వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డ్వామా పీడీ విద్యాసాగరరావు, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, హౌసింగ్ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, పీఆర్ ఈఈ టి.కొండయ్యపడాల్ , ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, జిల్లా టూరిజం ఆఫీసర్ జి.దాసు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ డీటీ వి.ధర్మరాజు, అధికారులు పాల్గొన్నారు.
ఉచిత భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ నిషాంతి
పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారులకు అందించే ఉచిత భోజనాన్ని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా పలువురు అర్జీదారులకు ఆమె భోజనం వడ్డించి, ఆహార పదార్థాల గురించి ఆరా తీశారు. భోజనానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఐటీడీఏ ఏవో ఎం.హేమలత, తదితరులున్నారు.