సకాలంలో అర్జీలు పరిష్కారం
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:06 AM
మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ నిశాంతి ఆదేశం
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 127 వినతులు స్వీకరణ
పాడేరు, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం)లో ఆమెఅధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు ఇచ్చే అర్జీలను పక్కాగా పరిశీలించి, సకాలంలో పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు హాజరుకాలేని పరిస్థితులుంటే, సంబంధిత అధికారులు ముందస్తు అనుమతి పొందాలన్నారు. శాఖపరమైన ఎటువంటి అనుమతినైనా సంబంధిత శాఖకు చెందిన ఉన్నతాధికారి వచ్చి విధిగా అనుమతి పొందాలన్నారు. జిల్లా అభివృద్ధిపై నిర్వహించే సమీక్షలకు పక్కా ప్రణాళికతో హాజరుకావాలని సూచించారు. మండల స్థాయిలో ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని, గ్రామ స్థాయి సమస్యలపై ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా అక్కడే అధికారులు పరిష్కరించాలన్నారు. పైస్థాయి నుంచి వచ్చే అర్జీలను గడువులోగా పరిష్కరించాలన్నారు. జిల్లా కలెక్టర్ టి.నిశాంతి, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో నీలకంఠరావు గిరిజనుల నుంచి 127 వినతులను స్వీకరించారు.
1100 కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలి
మీకోసంలో ఆర్జీలు సమర్పించిన అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 నెంబర్ కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ టి.నిశాంతి సూచించారు. అర్జీదారులు కాల్‌సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయిక్, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, హౌసింగ్ పీడీ బి.బాబు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్ , ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, స్వర్ణ గ్రామ శాఖ జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, నేషనల్ హైవే డీటీ వి.ధర్మరాజు, అధికారులు పాల్గొన్నారు.