Share News

ఉద్యోగుల ఆప్షన్లకు వేళాయె

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:50 AM

ఉద్యోగుల ఆప్షన్లకు వేళాయె

ఉద్యోగుల ఆప్షన్లకు వేళాయె
జిల్లా కలెక్టర్‌ కార్యాలయం

నేటి నుంచి స్థానిక కేడర్‌ కేటాయింపుల ప్రక్రియ

సీనియారిటీ జాబితాలు విడుదల కాకపోవడంతో ఉద్యోగుల్లో అయోమయం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో చేపడుతున్న ఉద్యోగుల విభజనకు సంబంధించి స్థానిక కేడర్‌ కేటాయింపు ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమను ఏ జిల్లాకు కేటాయించాలో కోరుతూ ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే మరికొద్ది గంటల్లో ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. శాఖల వారీగా సీనియారిటీ జాబితాలను మంగళవారం సాయంత్రం వరకు విడుదల చేయలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆయోమయం నెలకొంది. సీనియారిటీ ఆధారంగానే కేటాయింపులు జరగనుండడంతో జాబితాలు లేకుండానే ఆప్షన్లు ఎలా నమోదు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఉద్యోగి జిల్లా ఎంపికకు ఒక్కసారి మాత్రమే ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేసుకొనే అవకాశం ఉంది. ఒకసారి ఆప్షన్లను ఎంపిక చేసుకొని, అప్‌లోడ్‌ చేసిన తరువాత ఎటువంటి మార్పులకు వీలులేదు. దీంతో ఉద్యోగులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాల కేటాయింపుల సమయంలో ఉద్యోగుల సీనియారిటీతోపాటు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలు, స్థానిక కేడర్‌ అర్హతలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత తుది కేటాయింపు ఉత్తర్వులు, ఆ తరువాత బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులైతే స్పౌస్‌ గ్రౌండ్స్‌ కింద ఒకే కేడర్‌లో అవకాశం కల్పించనున్నప్పటికీ అది కూడా సీనియారిటీ నిబంధనలకు లోబడి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. తుది కేటాయింపు ఉత్తర్వులపై అభ్యంతరాలున్న ఉద్యోగులు ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి ఏడు రోజుల లోపు అప్పీల్‌ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

ఇదిలాఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్‌-2లో చేర్చడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జోన్‌-1లో చేర్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. దీనిపై స్పష్టత వచ్చిన తరువాతే తుది కేటాయింపులు జరుగుతాయని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ముందుగా అన్ని శాఖల సీనియారిటీ జాబితాలను పారదర్శకంగా విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించిన తరువాత ఆప్షన్ల ప్రక్రియ నిర్వహిస్తే తగు న్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. లేనిపక్షంలో కేటాయింపుల అనంతరం అప్పీళ్లు, వివాదాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Updated Date - Jul 22 , 2026 | 12:50 AM