Share News

ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌లకు పటిష్ఠ బందోబస్తు

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:22 AM

నగరంలో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకూ జరగనున్న మిలాన్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌), సిటీ ఇంటర్నేషనల్‌ పరేడ్‌కు సుమారు 5,700 మందితో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి తెలిపారు.

ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌లకు పటిష్ఠ బందోబస్తు

5,700 మంది సిద్ధం

4,000 మంది సివిల్‌, 700 మంది ఏఆర్‌ పోలీసులు

ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్‌ నుంచి 500 మంది

సెక్యూరిటీ వింగ్‌, రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీలు 500 మంది

సీపీ శంఖబ్రతబాగ్చి

విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకూ జరగనున్న మిలాన్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌), సిటీ ఇంటర్నేషనల్‌ పరేడ్‌కు సుమారు 5,700 మందితో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి తెలిపారు. ఆయన పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశమందిరంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఆర్కే బీచ్‌రోడ్డులో జరిగే ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌ కార్యక్రమాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు 57 దేశాల నుంచి నేవీ ఉన్నతాధికారులు, దేశంలోని ప్రముఖులు, నేవీ ఉన్నతాధికారులు పెద్దసంఖ్యలో హాజరవుతారన్నారు. సముద్రంలో జరిగే నౌకా విన్యాసాలను తిలకించేందుకు సుమారు లక్ష మంది జనం వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమం జరిగే చోట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారీకేడింగ్‌, బందోబస్తు ఏర్పాటుచేయాల్సి ఉంటుందన్నారు. అలాగే ప్రముఖులు నగరానికి చేరుకునే ప్రాంతాలు, బస చేసే హోటళ్లు, ప్రయాణించే మార్గాల్లో భద్రత కల్పించాల్సి ఉంటుందన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రముఖుల భద్రత దృష్ట్యా రోప్‌ పార్టీలు, రూట్‌ చెకింగ్‌ టీమ్‌లు, బాంబ్‌ చెకింగ్‌ టీమ్‌లు ఏర్పాటుచేస్తామన్నారు. కార్యక్రమాల సందర్భంగా 14 చోట్ల పార్కింగ్‌ ప్రాంతాలు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడంతో పాటు బీచ్‌రోడ్డు పరిసరాల్లో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేయాల్సి ఉంటుందన్నారు. బీచ్‌లో కార్యక్రమాలు జరుగుతున్నందున సముద్రంలో ఎవరైనా దిగి మునిగిపోకుండా చూడాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాల కోసం నాలుగు వేల మంది సివిల్‌ పోలీసులు, 700 మంది ఏఆర్‌ సిబ్బంది, 500 మంది ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్‌ సిబ్బందిని, బారీకేడింగ్‌, సెక్యూరిటీ, బాంబ్‌ చెకింగ్‌, రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీల కోసం మరో 500 మందిని వినియోగిస్తున్నామన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 01:33 AM