Share News

ఇంటర్‌ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:31 AM

ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి ఆదేశాలు ఇచ్చారు.

ఇంటర్‌ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు

అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి ఆదేశాలు

23 నుంచి పరీక్షలు

జిల్లాలో 85 కేంద్రాలు

ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 81 వేల మంది...

విశాఖపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):

ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి ఆదేశాలు ఇచ్చారు. శుక్రవారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ 85 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 81 వేల మంది హాజరుకానున్నారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటుచేసి 144 సెక్షన్‌ అమలుచేయాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని, నిరంతరం విద్యుత్‌, హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఇంటర్‌ బోర్డు పర్యవేక్షణాధికారి మురళీధర్‌ మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం పరీక్షలు 40,165 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 40,836 మంది రాస్తున్నారన్నారు. ప్రథమ, ద్వితీయ ఏడాది విద్యార్థులకు రోజు తప్పించి రోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సమీక్షలో పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


జనగణనకు కసరత్తు

అమరావతిలో శిక్షణ సమావేశానికి కలెక్టర్‌ హాజరు

వచ్చే నెల నుంచి జిల్లాలో అధికారులు, సిబ్బందికి శిక్షణ

మే నెల నుంచి ఇంటింటా సర్వే

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయి సమాచారం సేకరణ

విశాఖపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):

జన గణనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం అమరావతిలో నిర్వహించిన శిక్షణ సదస్సుకు జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ హాజరయ్యారు. జనగణనకు సంబంధించి కలెక్టర్‌ ప్రిన్సిపల్‌ అధికారిగా, డీఆర్వో జిల్లా అధికారిగా వ్యవహరించనున్నారు. జీవీఎంసీ వరకూ కమిషనర్‌ ప్రిన్సిపల్‌ అధికారిగా ఉంటారు.

జిల్లాలో సుమారు ఏడు లక్షల కుటుంబాలు ఉన్నాయి. జనగణన కోసం 300 నుంచి 350 ఇళ్లు, లేదా 700 నుంచి 750 జనాభాకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమిస్తారు. ఎన్యుమరేటర్‌పై సూపర్‌ వైజర్లు, మండల స్థాయి పర్యవేక్షకులు ఇలా పలువురు విధులు నిర్వహిస్తారు. జిల్లాలో ఏడు లక్షల ఇళ్లకు వెళ్లి జనాభా వివరాలు సేకరణకు సుమారు 2,330మంది ఎన్యుమరేటర్లు, మరికొంత మంది సూపర్‌వైజర్లు, ఇతర అధికారులు కలిసి సుమారు నాలుగు వేల మంది అవసరమని గుర్తించారు. అమరావతిలో ఉన్నతాధికారులు వెల్లడించిన అంశాలను జిల్లా అధికారులకు కలెక్టర్‌ వివరిస్తారు. ఈ నేపథ్యంలో మార్చి నెలలో అధికారులకు, ఏప్రిల్‌లో ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మే నెల నుంచి ఎన్యమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు నమోదుచేస్తారు. తద్వారా జిల్లాలో ఎన్ని కుటుంబాలు?, ఎన్ని ఇళ్లు ఉన్నాయి?..అనే దానిపై అంచనాకు వస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి తొమ్మిది నుంచి పూర్తిస్థాయిలో జనగణన చేపడతారు. ఎన్యమరేటర్‌ ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి యజమాని, ఇతర సభ్యులపేర్లు, వయస్సు, విద్యార్హతలు, వృత్తి వివరాలు నమోదుచేసుకుంటారు. ఈ పర్యాయం తొలిసారిగా కులం వివరాలు కూడా నమోదుచేయనున్నారు. దేశంలో 2011లో జనగణన జరిగింది. 2021లో మళ్లీ జరగాల్సి ఉన్నా...కరోనా కారణంగా వాయిదా పడింది.

Updated Date - Feb 21 , 2026 | 12:31 AM