Share News

టిఫిన్‌ సెంటర్లు మూత

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:07 AM

యుద్ధం ప్రభావం విశాఖపట్నంలో స్పష్టంగా కనిపిస్తోంది.

టిఫిన్‌ సెంటర్లు మూత

గ్యాస్‌ కొరతే కారణం

వాటికి సరకులు సరఫరా చేసే కిరాణా దుకాణాలకు 30 శాతం మేర తగ్గిన వ్యాపారం

యుద్ధం నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరుగుదల

;లీటరుకు రూ.20...

మరోవైపు ఎగుమతులు లేకపోవడంతో బియ్యం, పప్పుల ధరలు తగ్గుదల

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

యుద్ధం ప్రభావం విశాఖపట్నంలో స్పష్టంగా కనిపిస్తోంది. వంట గ్యాస్‌ కొరత వల్లరహదారుల పక్కన టిఫిన్‌ దుకాణాలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. ఒక్కో దుకాణంపై ఐదు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వారికి ఇప్పుడు ఉపాధి కరువైంది. ఏ పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.

టిఫిన్‌ సెంటర్లు మూతపడుతుండడంతో వాటికి రోజూ పప్పులు, ఉప్పులు, నూనెలను కిలోల కొద్దీ సరఫరా చేసే కిరాణా దుకాణాలకు కూడా వ్యాపారం తగ్గిపోయింది. హోటళ్ల నిర్వాహకులంతా స్థానిక కిరాణా దుకాణాల వద్దే సరుకులు కొంటారు. ఇప్పుడు ఆయా హోటళ్లు మూతపడడంతో అక్కడి కిరాణా దుకాణాలకు వ్యాపారం తగ్గిపోయింది. రోజువారీ టర్నోవర్‌లో 30 నుంచి 40 శాతం పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అక్కయ్యపాలెం పరిసరాల్లో దాదాపుగా సగం హోటళ్లు మూతపడ్డాయి. దాంతో అక్కడి కిరాణా వ్యాపారాలకు బిజినెస్‌ తగ్గిపోయింది. గత వారం రోజుల నుంచి ఇలాగే ఉందని కిరాణా వ్యాపారి సురేశ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

పెరిగిన వంట నూనెల ధరలు

వంట నూనెల ధరలు లీటరుకు రూ.20 చొప్పున పెరిగాయి. మొన్నటి వరకు ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటర్‌ రూ.160కి లభించేది. ఇప్పుడు రూ.180 చొప్పున అమ్ముతున్నారు. అన్ని రకాల బ్రాండ్లు రెండు,మూడు రూపాయలు అటు ఇటుగా రేట్లు పెంచేశాయి. అత్యధిక శాతం వంటనూనెలన్నీ క్రూడాయిల్‌ నుంచే తయారవుతాయి. అరబ్‌ దేశాల నుంచే దిగుమతి అవుతాయి. అక్కడి నుంచి వచ్చే నౌకల సంఖ్య తగ్గిపోవడంతో వంటనూనెల నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనిని హోల్‌సేల్‌ వ్యాపారులు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఇంతకు ముందులా పెట్టిన ఆర్డర్లు ఇవ్వడం లేదు. ఫ్రీడమ్‌ ఆయిల్‌ ప్యాకెట్లు ఒక్కో బాక్స్‌లో 16 ఉంటాయి. రిటైల్‌ వ్యాపారులు పది నుంచి ఇరవై బాక్స్‌లు అడిగితే వెంటనే పంపించేవారు. ఇప్పుడు రెండు, మూడు కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. యుద్ధం కొనసాగితే వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

తగ్గిన బియ్యం, పప్పుల ధరలు

భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే బియ్యం, పప్పు దినుసులు గతంలా ఇప్పుడు విరివిగా వెళ్లడం లేదు. షిప్పింగ్‌ లైన్స్‌ రవాణా చార్జీలు పెంచడం, కొన్ని ప్రాంతాలకు నౌకలు వెళ్లకపోవడం వంటి కారణాల వల్ల ఆహార ఉత్పత్తుల నిల్వలు ఎక్కడివక్కడ పేరుకుపోతున్నాయి. మరోవైపు స్థానికంగా పంటలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నింటి కారణంగా బియ్యం, పప్పుల ధరలు దిగి వస్తున్నాయి. బియ్యం అన్ని రకాలు 26 కిలోల బస్తాపై రూ.100 ధర తగ్గింది. అదేవిధంగా కందిపప్పు, మినపపప్పు, పెసరపప్పు వంటివి కూడా కిలోకు రూ.20 చొప్పున తగ్గాయి. వేరుశెనగ అయితే కిలోకి రూ.40 తగ్గింది. ఇవి ఇంతకు ముందు కిలో రూ.180 చొప్పున విక్రయించారు. ఇప్పడు రూ.140కే దొరుకుతున్నాయి. అయితే సూపర్‌ మార్కెట్లు, హైపర్‌ మార్కెట్లలో మాత్రం ఈ పప్పుల ధరలు తగ్గించడం లేదు. చిల్లర వ్యాపారులు, డీమార్ట్‌ వంటి దుకాణాల్లో ధరల్లో మార్పులు ఉన్నాయి.

అక్కయ్యపాలెంలో హోటళ్ల మూత

అక్కయ్యపాలెంలో వంట గ్యాస్‌ లభించకపోవడం వల్ల హోటళ్ల నిర్వాహకులు తమ వ్యాపారాలు ఆపేస్తున్నారు. రోడ్లపక్కన దుకాణాలు మూసేసి కనిపిస్తున్నాయి. రెట్టింపు ధర పెట్టినా గ్యాస్‌ (సిలిండర్‌కు రూ.2 వేలు) దొరక్కపోవడంతో వ్యాపారాలు మూసేసుకుంటున్నామని విక్రమ్‌కుమార్‌ అనే వ్యాపారి తెలిపారు. ఈ ప్రాంతంలో మహారాణి పార్లర్‌ ఉంది. ఏ సమయంలో వెళ్లినా టిఫిన్లు లభిస్తాయి. ఆ దుకాణం కూడా ఇప్పుడు మూసేశారు.

డీజిల్‌ సరఫరాపై ఆంక్షలు

కంపెనీలకు వంద లీటర్లకు మించి

ఇవ్వొద్దని ఆయిల్‌ కంపెనీల ఆదేశాలు

మల్కాపురం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

యుద్ధం ప్రభావం డీజిల్‌ సరఫరాపై పడింది. నౌకలు, బోట్లు, పరిశ్రమలు, తదితర వాటికి మూడు రోజులుగా డీజిల్‌ పంపిణీ తగ్గించారు. ఇప్పటివరకూ కంపెనీలకు, నౌకలకు, బోట్లకు అవసరమైనంత మేర డీజిల్‌ సరఫరా చేసేవారు. కానీ ఇప్పుడు వంద లీటర్లకు మించి ఇవ్వొద్దని బంక్‌లకు ఆయిల్‌ కంపెనీల యజమాన్యాలు ఆదేశాలు జారీచేశాయి. ప్రతిరోజు హెచ్‌పీసీఎల్‌ మిలినీయం పెట్రోల్‌ బంక్‌ నుంచి నౌకలకు, ఐఎస్‌పీఆర్‌ఎల్‌ కంపెనీకి, హెచ్‌పీసీఎల్‌లో వివిధ కంపెనీలకు పెద్దఎత్తున డీజిల్‌ వెళ్లేది. కానీ మూడు రోజులుగా రేషన్‌ విధించారు. దీంతో వాటికి ఇబ్బందులు మొదలయ్యాయి.

Updated Date - Mar 22 , 2026 | 01:07 AM