Share News

టిడ్కో గృహాలు రెండు నెలల్లో రెడీ

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:25 AM

మునిసిపాలిటీ పరిధిలోని టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ సరఫరా, తాగునీరు కోసం బోర్లు, మోటార్లు వంటి పనులు పూర్తయ్యాయి. చిన్నాచితకా పనులు మిగిలి ఉన్నాయి. రెండు నెలలో పనులన్నీ పూర్తి చేస్తామని టిడ్కో అధికారులు చెబుతున్నారు.

టిడ్కో గృహాలు రెండు నెలల్లో రెడీ
టిడ్కో గృహాలు

నర్సీపట్నంలో చురుగ్గా మౌలిక సదుపాయాల కల్పన

రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు, తాగునీటి పనులు పూర్తి

అందుబాటులోకి మురుగునీటి శుద్ధి ప్లాంట్‌

గృహప్రవేశాల కోసం లబ్ధిదారుల నిరీక్షణ

నర్సీపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోని టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ సరఫరా, తాగునీరు కోసం బోర్లు, మోటార్లు వంటి పనులు పూర్తయ్యాయి. చిన్నాచితకా పనులు మిగిలి ఉన్నాయి. రెండు నెలలో పనులన్నీ పూర్తి చేస్తామని టిడ్కో అధికారులు చెబుతున్నారు.

నర్సీపట్నం పురపాలక సంఘంలో సొంత ఇల్లు లేని పేదల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బలిఘట్టం, కసిమి రోడ్డులో టీడ్కో గృహ సముదాయాల నిర్మాణం మొదలైంది. సుమారు 60 శాతం పనులు పూర్తయ్యేసరికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అనర్హుల పేరుతో పలువురి పట్టాలను రద్దుచేసి, ఆ మేరకు బ్లాకుల నిర్మాణం చేపట్టలేదు. అంతేకాక రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నిర్మాణపనుల్లో తీవ్ర జాప్యం చేసింది. పైగా టీడీపీ హయాంలో నిర్మించి, రంగులు వేసిన భవనాలకు మళ్లీ వైసీపీ జెండాను పోలిన రంగులు వేయించింది. ఐదేళ్ల వైసీపీ హయాంలో భవన నిర్మాణాలు సైతం పూర్తికాలేదు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు, తాగునీరు, తదితర పనులు మొదలు పెట్టలేదు.

రెండేళ్ల క్రితం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టిడ్కో గృహ సముదాయాల నిర్మాణ పనుల్లో కదలిక వచ్చింది. మౌలిక సదుపాయాల పనులకు నిధులు మంజూరు చేయడంతో మెయిన్‌ రోడ్డు నుంచి అప్రోచ్‌ రోడ్డు, అంతర్గత రహదారులు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. తాగునీటి సరఫరా కోసం బలిఘట్టంలో 12, కసిమి రోడ్డులో ఎనిమిది బోర్లు తవ్వించి మోటార్లు బిగించారు. భవనాలపై వాటర్‌ ట్యాంకులు, నీటి నిల్వకు సంపులు నిర్మించారు. మురుగునీటి శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ సరఫరా కోసం సబ్‌స్టేషన్‌ నిర్మించారు. వీధుల్లో విద్యుత్‌ స్తంభాలు వేశారు. ట్రాన్స్‌ఫారాల నుంచి విద్యుత్‌ సరఫరా కల్పించారు. లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసిన తర్వాత మీటర్లు బిగిస్తారు. ఫ్లాట్లను త్వరగా తమకు అప్పగిస్తే.. శ్రావణ మాసంలో మంచి రోజులు చూసుకొని గృహప్రవేశాలు చేసుకుంటామని పలువురు లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా టిడ్కో గృహసముదాయాలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయని డీఈఈ బొత్సా సంధ్యని వివరణ కోరగా... రెండు నెలల్లో పనులన్నీ పూర్తి అవుతాయని, అనంతరం లబ్ధిదారులకు అప్పగిస్తామని వెల్లడించారు.

Updated Date - Jul 15 , 2026 | 12:25 AM