టిడ్కో ఫ్లాట్లు.. లబ్ధిదారుల పాట్లు
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:43 AM
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం.. టిడ్కో గృహ లబ్ధిదారులకు శాపంగా మారింది. గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసి ఫ్లాట్లను అప్పగించకపోవడంతో బ్యాంకు రుణాలకు వడ్డీతో కూడిన వాయిదాలు కట్టుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు.
రుణ వాయిదాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు
ఏళ్లు గడుస్తున్నా ఫ్లాట్లు అప్పగించని అధికారులు
మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం
అద్దె ఇళ్లల్లో ఉంటూ, రుణ వాయిదాలు ఎలా చెల్లిస్తామని లబ్ధిదారుల ప్రశ్న
నర్సీపట్నం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం.. టిడ్కో గృహ లబ్ధిదారులకు శాపంగా మారింది. గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసి ఫ్లాట్లను అప్పగించకపోవడంతో బ్యాంకు రుణాలకు వడ్డీతో కూడిన వాయిదాలు కట్టుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. ఒకపక్క అద్దె ఇళ్లల్లో నివాసం వుంటూ, మరోవైపు రుణ వాయిదాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని నిరుపేదలైన టిడ్కో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాట్లు అప్పగించకుండా రుణ వాయిదాలు ఎలా చెల్లిస్తామని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లో సొంత ఇళ్లు లేనిపేదలకు టిడ్కో ఆధ్వర్యంలో జీ ప్లస్ త్రీ విధానంలో గ్రూప్ హౌస్‌ల నిర్మాణం చేపట్టింది. నర్సీపట్నం మునిసిపాలిటీలోని పేదల కోసం బలిఘట్టం శివాలయం వద్ద, బయపురెడ్డిపాలెం కసిమి రోడ్డులో రెండు వేలకుగాపైగా ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. వాటిలో 300, 365 చదరపు విస్తీర్ణంగల ఫ్లాట్లలో హాలు, కిచెన్, ఒక పడక గది, 430 చదరపు అడుగుల విస్తీర్ణంగల ఫ్లాట్లలో హాలు, కిచెన్, రెండు పడగ గదువు వున్నాయి. 60 శాతానికిపైగా నిర్మాణాలు పూర్తయ్యే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. సుమారు రెండేళ్లపాటు నిర్మాణ పనుల్లో ఎటువంటి పురోగతి లేదు. ఇదే సమయంలో నిర్మాణ పనులు ప్రారంభం కాని బ్లాకులను రద్దు చేసి, ఆయా లబ్ధిదారులకు ఊరు శివారున సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించారు. టీడీపీ హయాంలో పూర్తయిన 1,824 టిడ్కో గృహాలకు వైసీపీ జెండా రంగులు వేశారు. గృహసముదాయంలో తాగునీరు, రహదారులు, విద్యుత్తు, డ్రైనేజీ కాలువలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇదిలావుండగా బలిఘట్టంలో నిర్మించిన 300 చదరపు అడుగుల ఫ్లాట్లను (384) లబ్ధిదారులకు ఉచితంగా మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 1,440 మంది లబ్ధిదారుల్లో 926 మందికి బ్యాంకు రుణాలు మంజూరు చేశారు. సిబిల్ స్కోరు, వయస్సు 60 ఏళ్లు దాటి పోవడం, ఈ మధ్య కాలంలో కొంతమంది చనిపోవడంతో 341 మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు తిరస్కరించారు. వీరిలో 17 మంది మొత్తం సొమ్ము చెల్లించారు. మిగిలిన 324 మందితోపాటు కొత్తగా నిర్మించి 144 ఫ్లాట్లు.. మొత్తం 468 ఫ్లాట్లుకి రుణాలు ఇవ్వాల్సి ఉంది.
ఇదిలావుండగా టిడ్కో గృహాలను ఏళ్ల తరబడి అప్పగించకపోవడంతో పలువురు లబ్ధిదారులు బ్యాంకులకు రుణవాయిదాలు చెల్లించడంలేదు. దీంతో బ్యాంకు అధికారులు ఆయా రుణగ్రస్థులను మొండి బకాయిల జాబితాలో చేర్చారు. టిడ్కో గృహాలను అప్పగించకపోవడంతో నెలనెలా వేలాది రూపాయలు అద్దె చెల్లించి పరాయి ఇళ్లల్లో వుంటున్నామని, ఇటువంటి పరిస్థితుల్లో రుణ వాయిదాలను ఎలా చెల్లించగలమని లబ్ధిదారులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మిగిలిన 468 మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వరంగ బ్యాంకులు ముందుకు రావడంలేదు. దీంతో టిడ్కో అధికారులు 11 శాతం వడ్డీకి గృహ రుణాలు ఇవ్వడానికి ‘వాస్తు హౌసింగ్ ఫైనాన్స్’తో ఒప్పందం చేసుకున్నారు. త్వరలో లోన్ మేళా పెట్టి 468 మందికి రుణాలు ఇస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.