గెలుపు గుర్రాలకే టికెట్లు
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:21 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామని టీడీపీ స్థానిక ఎన్నికల జిల్లా పరిశీలకుడు పేరబత్తుల రాజశేఖర్ అన్నారు.
టీడీపీ స్థానిక ఎన్నికల జిల్లా పరిశీలకుడు రాజశేఖర్
అరకులోయలో మూడు పార్టీల నేతలతో సమావేశం
ఆశావహుల నుంచి మరోసారి దరఖాస్తులు స్వీకరణ
రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల జాబితా
అరకులోయ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామని టీడీపీ స్థానిక ఎన్నికల జిల్లా పరిశీలకుడు పేరబత్తుల రాజశేఖర్ అన్నారు. శుక్రవారం అరకులోయ సమీపంలోని రిసార్టులో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవన్నారు. గెలిచే స్థానాల్లో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఇప్పటికే మూడు పార్టీల నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించామని, రిజర్వేషన్లు వెలువడడంతో మరోసారి ఆయా పార్టీల నేతల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రెండు, మూడు రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్టు రాజశేఖర్ తెలిపారు. అనంతరం జనసేన అరకులోయ ఇన్చార్జి శెట్టి చిరంజీవి మాట్లాడుతూ గెలవగలిగే స్థానాల్లోనే జనసేన పోటీ చేస్తుందన్నారు. పోటీ చేసే వారు గెలవడానికి అనుకూలంగా ఉందో? లేదో? అంచనా వేసుకొని దరఖాస్తు చేసుకోవాలన్నారు. చివరికి కూటమి పార్టీల అభ్యర్థులకు విజయమే వరించాలన్నారు. బీజేపీ నాయకులు దేవదాసు, రామచందరరావు మాట్లాడుతూ బీజేపీకి ఎక్కడ అనుకూలంగా ఉందో అక్కడే పోటీ చేస్తుందన్నారు. టీడీపీ అరకు నియోజకవర్గ పరిశీలకుడు బుద్ద నాగజగదీశ్వరరావు, టీడీపీ అరకు ఇన్చార్జి దొన్నుదొర మాట్లాడుతూ టీడీపీ నియమావళిని పాటించి, గెలిచేవారినే అభ్యర్థులుగా ప్రకటిస్తుందన్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు ఓటు చీలిపోకుండా చూడాలన్నారు.
ఇన్చార్జీలతో ఆశావహులు మంతనాలు
ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న టీడీపీలోని ఆశావహులు పార్టీ పరిశీలకులు పేరబత్తుల రాజశేఖర్, బుద్ద్ద నాగజగదీశ్వరరావు, దొన్నుదొరలతో మంతనాలు జరిపారు. వ్యక్తిగతంగాను, మద్దతుదారులతో కలిసి మంతనాలు చేశారు. కొంతమంది ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచే వారి నుంచి దరఖాస్తులను పార్టీ పరిశీలకులు స్వీకరించారు.