టికెట్లు...ఇక్కట్లు
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:11 AM
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శన టికెట్ల కోసం భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.
చందనోత్సవ టికెట్ల కోసం భక్తుల పాట్లు
ఆన్‌లైన్‌లో సవ్యంగా సాగని విక్రయాలు
ఆఫ్‌లైన్ (బ్యాంకులు)లో ప్రారంభించిన కొద్దిసేపటికే క్లోజ్
సింహాచలం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శన టికెట్ల కోసం భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో అమ్మకాలు సాంకేతిక సమస్యల కారణంగా సవ్యంగా సాగడం లేదు. ఇక ఆఫ్‌లైన్‌లోనూ విక్రయాలు ప్రారంభించిన కొద్దిసేపటికే టికెట్లు (ఆరోజు కోటా) అయిపోయాయంటూ చెబుతుండడంతో గంటలకొద్దీ క్యూలో నిల్చున్నవారంతా నిరాశతో వెనుతిరగాల్సి వస్తోంది.
మంత్రుల కమిటీ చందనోత్సవ ఏర్పాట్లపై పలుమార్లు ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించి నిజరూప దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో 70 శాతం, ఆఫ్‌లైన్ (కొన్ని జాతీయ బ్యాంకుల ద్వారా)లో 30 శాతం విక్రయించాలని నిర్ణయించింది. ఈనెల 12న ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అయితే 12, 13 తేదీల్లో సాంకేతిక సమస్య వల్ల విక్రయాలు సక్రమంగా సాగలేదు. మంగళవారం కూడా అదే పరిస్థితి. బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము డెబిట్ అయినా టికెట్ మాత్రం జారీకాలేదని కొంతమంది వాపోయారు. ఆన్‌లైన్ ఇబందులు మూడో రోజు కూడా కొనసాగడంపై దేవస్థానం అధికారులను ప్రశ్నించగా గతంలో 9అండ్9 అనే ఏజెన్సీ ద్వారా దేవదాయ శాఖ కార్యకలాపాలు సాగించేదని, ఇప్పుడు ప్రభుత్వం టీఎంఎస్ (టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) అనే సంస్థకు మార్చిందని, సాఫ్ట్‌వేర్‌లో తలెత్తుతున్న సమస్యల కారణంగా టికెట్ల విక్రయాల్లో ఇక్కట్లు చూడాల్సి వస్తోందన్నారు. వాటిని సరిదిద్దేందుకు రాష్ట్ర స్థాయిలో అధికారులతో కూడిన సాంకేతిక బృందం నిరంతరం కృషిచేస్తూనే ఉందని చెప్పారు. దేవస్థానం ఈఓ జె.వెంకటరావు చెప్పిన వివరాల ప్రకారం 12,13,14 తేదీల్లో మొత్తం ఆన్‌లైన్‌లో రూ.1,000 టికెట్లు 2,800, రూ.300 టికెట్లు 6,000 విక్రయాలకు ఉంచారు.
ఇక ఆఫ్‌లైన్‌లో అంటే నిర్దేశించిన జాతీయ బ్యాంకుల ద్వారా 30 శాతం అమ్మకాలు సాగిస్తామని అధికారులు ప్రకటించారు. అందుకు ఈనెల 13న శ్రీకారం చుట్టారు. దేవస్థానం అధికారులు, బ్యాంకు అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం...నాలుగు బ్రాంచీల ద్వారా 13, 14 (మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సెలవు అయినప్పటికీ దేవస్థానం అధికారుల విజ్ఞప్తి మేరకు విక్రయాలు జరిపారు) తేదీల్లో రూ.1,000 టికెట్లు 1,600 టికెట్లు, రూ,300 టికెట్లు 2,500 విక్రయాలు జరిగాయి. టికెట్ల కోసం బ్యాంకుల ఎదుట ఉదయం ఏడు గంటల నుంచే భక్తులు బారులుతీరుతున్నారు. తీరా బ్యాంకులు తెరచి విక్రయాలు ప్రారంభించిన కొద్ది నిముషాలకే టికెట్లు అయిపోయాయని చెబుతుండడంతో భక్తులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. అసలు దేవస్థానం జారీచేసిన టికెట్లన్నీ భక్తులకు విక్రయిస్తున్నారా?, లేదా పక్కదారి పట్టిస్తున్నారా?...అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో మరిన్ని టికెట్లు
30 శాతం నుంచి 50 శాతానికి పెంపు: ఈఓ జల్లెపల్లి వెంకటరావు
టికెట్ల విషయంలో తలెత్తుతున్న సమస్యను అధిగమించేందుకు బుధవారం నుంచి ఆఫ్‌లైన్ విక్రయాలను పెంచుతున్నట్టు దేవస్థానం ఈవో జల్లెపల్లి వెంకటరావు ప్రకటించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆఫ్‌లైన్‌లో...బ్యాంకుల ద్వారా గడచిన రెండు రోజుల్లో రూ.1,000 టికెట్లు 1,600, రూ.300 టికెట్లు 2,500 విక్రయించామన్నారు. కాగా ఆన్‌లైన్‌లో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఆఫ్‌లైన్ విక్రయాలను 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని నిర్ణయించి, అందుకు దేవదాయ శాఖ రాష్ట్ర అధికారుల నుంచి అనుమతులు పొందామని చెప్పారు. దానిని అనుసరించి రానున్న మూడు రోజులు అంటే 15,16,17 తేదీల్లో బ్యాంకుల ద్వారా రూ.1,000 టికెట్లు వరుసగా 1,760, 1,590, 1,590, రూ.300 టికెట్లు వరుసగా 2,400, 2,400, 2,400 విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. దాంతోపాటు ఆన్‌లైన్‌లో సొమ్ము డెబిటై టికెట్లు లభించని వారందరికీ వాటిని వాపసు చేసేవిధంగా చూస్తానని ఈఓ ప్రకటించారు.