Share News

మళ్లీ టికెట్ల రగడ

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:12 AM

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవ టికెట్ల పంపిణీలో ఏటా మాదిరిగానే ఈసారి కూడా తీవ్ర జాప్యం, పక్షపాత ధోరణి కనిపిస్తోంది.

మళ్లీ టికెట్ల రగడ

చందనోత్సవ టికెట్ల జారీలో తీవ్ర జాప్యం, పక్షపాతం

నిర్ణయం తీసుకోవాల్సిన డీఆర్‌ఓ ఢిల్లీలో మకాం

ఈఓ కార్యాలయం నుంచి కొందరికే జారీ

లేఖలన్నీ బుట్టదాఖలు... ఫోన్లకు నో రెస్పాన్స్‌

దేవస్థానానికి చెందిన ముగ్గురి చేతిలో 2 వేల టికెట్లు?

నచ్చినవారికి విక్రయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవ టికెట్ల పంపిణీలో ఏటా మాదిరిగానే ఈసారి కూడా తీవ్ర జాప్యం, పక్షపాత ధోరణి కనిపిస్తోంది. సాధారణ భక్తుల నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకు నాలుగు రోజులు ముందుగానే బ్యాంకుల్లో కొన్ని, ఆన్‌లైన్‌లో కొన్ని టికెట్లు విక్రయించి శుక్రవారంతో మమ అనిపించేశారు. బ్యాంకుల్లో టికెట్ల విక్రయంపై చాలామంది సంతృప్తి చెందగా ఆకస్మికంగా దానిని శుక్రవారం ఆపేశారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని గురువారం రాత్రి తొమ్మిది గంటలకు ఈఓ వెంకటరావు ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించారు. ఒకసారి లాగిన్‌ అయితే ఒక్క టికెటే జారీచేశారు. ఇలా ఓ భక్తుడు 8.02 గంటలకు ఒక టికెట్‌ తీసుకొని, మళ్లీ 8.04 గంటలకు లాగిన్‌ అయ్యేసరికి టికెట్లన్నీ అయిపోయాయని వెబ్‌సైట్‌ చూపించింది. అంటే ఏమి జరిగిందో ఊహించుకోవచ్చు. బ్యాంకుల్లో అయితే భక్తులు క్యూలైన్లలో ఉండి నిలదీస్తున్నారని, ఆన్‌లైన్‌ అయితే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని గుర్తించి, ఆ మార్గాన్నే అధికారులు ఎన్నుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేలకు చెరో 25 టిక్కెట్లు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.1,500 టికెట్లు 25, వేయి రూపాయిల టికెట్లు మరో 25 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇవికాకుండా ఎమ్మెల్యే కుటుంబంతో అంతరాలయం దర్శనం చేసుకోవడానికి ఆరుగురికి అవకాశం కల్పించారు. ఈ టికెట్లను కూడా ఇంకా వారికి ఇవ్వలేదు. కారు పాస్‌ ఒక్కటి మాత్రమే ఇస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పుతున్న ముగ్గురు ప్రజా ప్రతినిధులకు మాత్రం వందేసి టికెట్లు, పదేసి చొప్పున కారు పాస్‌లు ఇవ్వాలని నిర్ణయించారు.

దరఖాస్తు చేసిన వారికి మొండిచేయి

నగరంలో ప్రముఖులు, వ్యాపారులు, దాతలు, పలు సంస్థల ప్రతినిధులు ప్రత్యేకంగా దేవస్థానం ఈఓకు లేఖలు సమర్పించి టికెట్లు కోరుతుంటారు. వారు కోరినన్ని కాకుండా అందులో సగం లేదా ఎన్నోకొన్ని సర్దుబాటు చేస్తుంటారు. ఈసారి ఆ లేఖల్లో కొన్నింటిని ఈఓ కార్యాలయంలోనే ఉంచుకొని, మిగిలినవి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) కార్యాలయానికి పంపించారు. డీఆర్‌ఓ గత రెండు రోజులుగా నగరంలో లేరు. కార్యాలయ పనిపై ఢిల్లీ వెళ్లారు. శనివారం సాయంత్రానికిగానీ రారు. ఆయన కార్యాలయం బాధ్యతలు ఏఓకు అప్పగించారు. అక్కడ లేఖలను దొంతర్లుగా పెట్టడం తప్ప వాటికి ఎన్ని టికెట్లు ఇవ్వాలనే దానిపై నిర్ణయం జరగలేదు. మరో వైపు ఈఓ కార్యాలయం తమ దగ్గర ఉంచుకొన్న లేఖల్లో కొన్నింటికి పది అడిగితే ఐదు, నాలుగు అడిగితే రెండు చొప్పున వేయి రూపాయల టికెట్లు ఇస్తున్నారు. కొంతమంది లేఖలనైతే పూర్తిగా పక్కన పెట్టేశారు. సంబంధిత సంస్థల ప్రతినిధులు ఫోన్లు చేసినా స్పందించడం లేదు.

ఆ మగ్గురి చేతిలో 2 వేల టికెట్లు?

దేవస్థానంలో ముగ్గురు వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక ఏఈఓ, మరో సూపరింటెండెంట్‌, రవాణా విభాగానికి చెందిన ఏఈ కలిసి వేయి రూపాయల టికెట్లు ఓ రెండు వేలు వారి చేతిలో ఉంచుకున్నట్టు చెబుతున్నారు. వాటిని నచ్చిన వారికి విక్రయిస్తున్నారంటున్నారు. ఈఓ కార్యాలయం పరోక్షంగా వారికి పూర్తి సహకారం అందిస్తోంది. ప్రత్యేక అధికారి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉండడంతో వారు ఆడింది ఆటగా సాగుతోంది.


వేకువజామున 3.30 గంటల నుంచే దర్శనాలు

భక్తులంతా తమ సొంత వాహనాలను కొండ దిగువనే నిలపాలి

అక్కడ నుంచి దేవస్థానం ఏర్పాటుచేసిన బస్సుల్లో రావాలి

దేవస్థానం ఈఓ జల్లెపల్లి వెంకటరావు

సింహాచలం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి):

ఈనెల 20న జరగనున్న వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం ఈవో జల్లెపల్లి వెంకటరావు తెలిపారు. ఉచిత, రూ.300 టికెట్ల కొనుగోలుదారులకు వేకువజామున 3.30 గంటల నుంచి, రూ.1,000 టికెట్ల కొనుగోలుదారులకు ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు, రూ.1,500 టికెట్లు కొనుగోలు చేసినవారికి వేకువజామున 3.30 గంటల నుంచి దర్శనాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. సింహగిరిపై వాహనాల పార్కింగ్‌కు స్థలం చాలా తక్కువగా ఉన్నందున కొండదిగువనే అందుకు ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులందరూ తప్పనిసరిగా సొంత వాహనాలను కొండదిగువనే వదిలి, దేవస్థానం ఏర్పాటుచేసిన ఉచిత రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకోవాలన్నారు. లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రాలను కొండదిగువన కృష్ణాపురం గోశాల, పాతఅడివివరం కూడలి, తొలిపావంచా, సింహపురి కాలనీ, శ్రీనివాసనగర్‌లోని నూతన కల్యాణ మండపాల వద్ద ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 20వ తేదీ సాయంత్రం ఆరు గంటల తరువాత భక్తులను మెట్లమార్గంలో కానీ, బస్సుల్లో కానీ అనుమతించబోమని స్పష్టంచేశారు. రాత్రి ఏడు గంటలకు క్యూలైన్ల ద్వారాలు మూసివేసి అప్పటికి వాటిల్లో ఉన్న భక్తులందరికీ రాత్రి 11 గంటల వరకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.

అతిముఖ్యులకే అంతరాలయ దర్శనాలు

అంతరాలయ దర్శనాలు కొద్దిమంది అతిముఖ్యులకు మాత్రమే కల్పిస్తామని దేవస్థానం ఈఓ ప్రకటించారు. తొలిదర్శనం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు కుటుంబ సభ్యులకు, తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరపున, తితిదే తరపున పట్టువస్త్రాలు సమర్పించే వారికి, అనంతరం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులకు మాత్రమే అంతరాలయం దర్శనాన్ని ఉదయం ఐదు గంటలలోపు కల్పించనున్నట్టు చెప్పారు.

Updated Date - Apr 18 , 2026 | 01:12 AM