Share News

టికెట్‌ ప్లీజ్‌!

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:00 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఇవ్వాలంటూ కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీ శ్రేణుల నుంచి ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి నేతలకు పెద్ద ఎత్తున విజ్ఞాపనలు అందుతున్నాయి. మునిసిపాలిటీల్లో వార్డు కౌన్సిలర్లు, మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవులకు తమ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో కూటమిలోని మూడు పార్టీల జిల్లాస్థాయి నేతలు ఉమ్మడిగా సమావేశమై, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు.

టికెట్‌ ప్లీజ్‌!

స్థానిక ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలంటూ కూటమి నేతలకు పెద్దఎత్తున వినతులు

జీవీఎంసీ అనకాపల్లి వార్డులపై మూడు పార్టీల నేతలు సమావేశం

జనసేన-3, టీడీపీ-2, బీజేపీ-1 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం

చివరి నిమిషంలో రెండు వార్డులు కావాలన్న బీజేపీ నేతలు

అసంపూర్తిగా ముగిసిన చర్చలు

నేడు కొలిక్కివచ్చే అవకాశం

అనకాపల్లి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఇవ్వాలంటూ కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీ శ్రేణుల నుంచి ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి నేతలకు పెద్ద ఎత్తున విజ్ఞాపనలు అందుతున్నాయి. మునిసిపాలిటీల్లో వార్డు కౌన్సిలర్లు, మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవులకు తమ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో కూటమిలోని మూడు పార్టీల జిల్లాస్థాయి నేతలు ఉమ్మడిగా సమావేశమై, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. ఇంకా ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని మండలాల్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌ పదవులకు ఏకాభిప్రాయంతో పేర్లను సూచించాలని కేడర్‌కు సూచిస్తున్నారు. నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఏ పార్టీ పోటీచేయాలన్న దానిపై ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ.. ఆయా మునిసిపాలిటీల్లోని వార్డులకు సంబంధించి పొత్తులు, సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కావడంతో శనివారం సాయంత్రంకల్లా సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు, ఆ తరువాత సర్పంచ్‌ పదవులకు సంబంధించి సీట్ల పంపకాలపై మూడు పార్టీల నేతలు చర్చలు జరుపుతారని తెలిసింది.

కాగా జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ పరిధిలోని వార్డుల నుంచి కూటమి తరపున కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి ఆశావహులు అధిక సంఖ్యలో వున్నారు. ఇక్కడ మొత్తం ఆరు వార్డులు వుండగా, ఒక్కో వార్డు నుంచి ఆరేడుగురు టికెట్లు ఆశిస్తున్నారు. శుక్రవారం ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, టీడీపీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆధ్యర్యంలో అభ్యర్థుల ఎంపికపై సమావేశం నిర్వహించారు. ఆరు వార్డుల్లో మూడు జనసేనకు, రెండు టీడీపీకి, ఒకటి బీజేపీకి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో తమకు రెండు వార్డులు ఇవ్వాలని బీజేపీ నేతులు పట్టుబట్టారు. దీంతో సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కిరాలేదు. వార్డుల వారీగా ఆశావహుల పేర్లతో జాబితాలను సిద్ధం చేసి, అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతను ఆయా పార్టీల రాష్ట్ర పెద్దలకు వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

Updated Date - Oct 17 , 2026 | 01:00 AM