Share News

బెదిరించి... దౌర్జన్యంగా!

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:14 AM

ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ సర్పంచ్‌ నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి జేబు నుంచి ఓ అభ్యర్థికి చెందిన స్లిప్‌ను ప్రత్యర్థి తీసుకోవడం వివాదాస్పదమైంది.

బెదిరించి... దౌర్జన్యంగా!

రిటర్నింగ్‌ అధికారి జేబు నుంచి విత్‌డ్రా స్లిప్‌ తీసుకున్న ప్రత్యర్థి

వెలుగులోకి వచ్చిన సీసీ టీవీ ఫుటేజ్‌

గంభీరం పంచాయతీ నామినేషన్‌ విత్‌డ్రా వ్యవహారం

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ సర్పంచ్‌ నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి జేబు నుంచి ఓ అభ్యర్థికి చెందిన స్లిప్‌ను ప్రత్యర్థి తీసుకోవడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు వచ్చింది.

వెల్లంకి టీఎస్సార్‌ కల్యాణ మండలంలో గంభీరం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ, ఉపంహరణ ప్రక్రియ నిర్వహించారు. గంభీరం, వెల్లంకితోపాటు మరో రెండు పంచాయతీల నామినేషన్ల ప్రక్రియకు స్టేజ్‌-1 రిటర్నింగ్‌ అధికారిగా నరసింగరావు అనే ప్రధానోపాధ్యాయుడ్ని నియమించారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఈనెల 27వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. గంభీరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికి పోటీచేసిన బోయ వెంకటరమణ దాఖలుచేసిన రెండు సెట్లలో ఒక సెట్‌ నామినేషన్‌ విత్‌డ్రాచేసుకున్నారు. నిబంధనల ప్రకారం అభ్యర్థి దాఖలుచేసిన రెండు సెట్లలో ఒకటి విత్‌డ్రా చేసుకుంటే ఆటోమెటిక్‌గా రెండో సెట్‌ కూడా ఉపసంహరించుకున్నట్టుగా పరిగణిస్తారు. బోయ వెంకటరమణ నామినేషన్‌ ఉపసంహరించున్నట్టు రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరించి రశీదు సిద్ధంచేసి తన జేబులో పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన మరో అభ్యర్థి వానపల్లి ముత్యాలరావు నేరుగా ఆర్వో టేబుల్‌ వద్దకు వచ్చి, అతని జేబులో ఉన్న బోయ వెంకటరమణ విత్‌డ్రా స్లిప్‌ను తీసుకున్నారు. దీంతో ఆర్వో షాక్‌కు గురై వెంటనే ముత్యాలరావు వెంటపడినా అతను తిరిగివ్వలేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. నిబంధనల మేరకు ఎన్నికల అధికారి విధులకు ఆటంకం కలిగించకూడదు. అయితే ఎన్నికల అధికారి మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చిందని, ఒక దశలో బెదిరించారనే ప్రచారం సాగుతోంది. నిబంధనల మేరకు బోయ వెంకటరమణ తను దాఖలుచేసిన రెండు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో కూటమి పార్టీల సానుభూతిపరుడు వానపల్లి ముత్యాలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారికి డీపీవో ఇప్పటికే షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.

Updated Date - Nov 30 , 2026 | 01:14 AM