కల్యాణపులోవలో మూడు రోజులపాటు ఉత్సవాలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:46 AM
మహాశివరాత్రి సందర్భంగా కల్యాణపులోవలో పోతురాజుబాబు, పెద్దింటమ్మవార్ల ఉత్సవాలను ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించేదుకు అధికారులు, ఉత్సవ కమిటీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి సుమారు మూడు లక్షల భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తుల కోసం భారీ ఏర్పాట్లు
రావికమతం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా కల్యాణపులోవలో పోతురాజుబాబు, పెద్దింటమ్మవార్ల ఉత్సవాలను ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించేదుకు అధికారులు, ఉత్సవ కమిటీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి సుమారు మూడు లక్షల భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే రాజు ఆదేశాల మేరకు పలు శాఖల అధికారులు గత వారం రోజుల నుంచి ఇక్కడ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆలయ పరిసరాల్లో సుమారు 45 ఎకరాల్లో తుప్పలు తొలగించి, ఎత్తు పల్లాలను సరిచేయించారు. ఆలయం సమీపానికే వాహనాలు వచ్చేలా రింగ్ రోడ్డు నిర్మించారు. ఉచిత ప్రసాదాల పంపిణీకి 28 కౌంటర్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో వుండే భక్తులకు ఎండ తగలకుండా షామియానాలు వేశారు. డీసీసీబీ సహకారంతో భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయనున్నారు. ఆదివారం భక్తులు జాగారం చేయనుండడంతో అడుగడుగునా విద్యుత్ దీపాలను అమర్చారు. రిజర్వాయర్‌లో పుణ్యస్నానాల అనంతరం మహిళలు దుస్తులు మార్చుకొనేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ వద్ద బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో వుంచుతున్నారు. నాలుగుచోట్ల వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి 80 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో, జలాశయం వద్ద 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దొండపూడి ఠాణా నుంచి కల్యాణపులోవ వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసేందుకు పలుచోట్ల పోలీసు బీట్‌లను ఏర్పాటు చేశారు. ఆటోలు, వ్యాన్లు, ఇతర భారీ వాహనాలను, దొండపూడి ఠాణా వద్దే నిలిపివేస్తారు. భక్తులు ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లవచ్చు. ఆయా ఏర్పాట్లను నర్సీపట్నం ఆర్డీవో వివి.రమణ,కొత్తకోట సీఊ కోటేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు.