Share News

కుటుంబంలో కలహాలతో ముగ్గురి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:22 AM

మండలంలోని రైవాడలో ఆదివారం రాత్రి కుటుంబ కలహాలతో ముగ్గురు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

కుటుంబంలో కలహాలతో  ముగ్గురి ఆత్మహత్యాయత్నం
క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకోవడంతో తీవ్రగాయాలు

పరిస్థితి ఆందోళనకరం.. కేజీహెచ్‌కు తరలింపు

దేవరాపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రైవాడలో ఆదివారం రాత్రి కుటుంబ కలహాలతో ముగ్గురు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

రైవాడకు చెందిన చల్లా ఈశ్వరరావు అలియా్‌స బుజ్జికి చోడవరం మండలం గంధవరం గ్రామానికి చెందిన నాగమణితో సుమారు 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నవ్య, సాహిత్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈశ్వరరావు తల్లి వరహాలమ్మ కూడా వీరితోపాటే వుంటున్నది. అయితే నాగమణికి అటు అత్త, ఇటు భర్తతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదికాస్తా చోడవరం, దేవరాపల్లి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదుల వరకు వెళ్లింది. దీంతో నాగమణి సుమారు రెండేళ్ల నుంచి తన సోదరుడైన పైడిరాజు వద్ద వుంటున్నది. వారం రోజుల కిందట వరహాలమ్మ స్వయంగా గంధవరం వెళ్లి ఉన్న కోడలికి రైవాడ తీసుకువచ్చింది. అయితే ఆదివారం రాత్రి మళ్లీ ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఈశ్వరరావు పిల్లలిద్దరినీ బయటకుపంపించి తలుపులు వేశాడు. అనంతరం ముగ్గురూ లోపల పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొన్నారు. మంటలకు తాళలేక పెద్దగా కేకలు వేయడంతో ఈశ్వరరావు అన్నయ్య రాంబాబు, ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగలుగొట్టి, మంటలను ఆర్పారు. తీవ్రంగా గాయపడిన వీరిని 108 వాహనంలో కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.

Updated Date - Nov 02 , 2026 | 01:22 AM