రెండు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:02 AM
తల్లిదండ్రుల చేతికి అందివచ్చిన బిడ్డలు అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. బొలేరో రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరు స్నేహితులను కబళించింది. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కన్నవారికి తీరని దుఃఖాన్ని మిగిల్చిన ఈ విషాదకర సంఘటన రావికమతం మండలం కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్‌ఐ రఘువర్మ తెలిపిన వివరాలిలా వున్నాయి.
రావికమతంలో స్కూటీని ఢీకొన్న బొలేరో వ్యాన్
ఇద్దరు బాలుర మృతి, మరొకరికి తీవ్రగాయాలు
మామిడిపాలెం వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి
---
జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. రావికమతంలో బొలేరో వాహనం ఢీకొనడంతో స్కూటీపై వెళుతున్న ఇద్దరు బాలురు దుర్మరణం పాలయ్యారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అనకాపల్లి మండలం మామిడిపాలెం వద్ద ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఽఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి గాయాలయ్యాయి
------
రావికమతం/ రోలుగుంట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):
తల్లిదండ్రుల చేతికి అందివచ్చిన బిడ్డలు అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. బొలేరో రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరు స్నేహితులను కబళించింది. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కన్నవారికి తీరని దుఃఖాన్ని మిగిల్చిన ఈ విషాదకర సంఘటన రావికమతం మండలం కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్‌ఐ రఘువర్మ తెలిపిన వివరాలిలా వున్నాయి.
రావికమతం ఎస్సీ కాలనీకి చెందిన దిగుమర్తి పండు (17), చెవ్వేటి కోటేశ్వరరావు (17), ఐనవల్లి బాబ్జీ (16) స్నేహితులు. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ముగ్గురూ కలిసి ద్విచక్ర వాహనం (స్కూటీ)పై మేడివాడ వైపు వెళుతున్నారు. ఇదే సమయంలో మేడివాడ వైపు నుంచి వస్తున్న బొలేరా వాహనం భవ్యశ్రీ హార్డ్‌వేర్ దుకాణం వద్ద స్కూటీని బలంగా ఢీకొన్నది. దీనిపై వున్న ముగ్గురూ రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం పండును నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి, కోటేశ్వరరావును అతని కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. బాబ్జీ చికిత్స పొందుతున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బొలేరో వాహనాన్ని స్టేషన్‌కు తరలించి, డ్రైవర్ నల్లపురెడ్డి శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రఘువర్మ తెలిపారు.
కాగా రోడ్డు ప్రమాద మృతుల్లో ఒకరైన దిగుమర్తి పండు తండ్రి లోవరాజు చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి చినమ్మలు కూలి పనులకు వెళుతుంది. ఈ దంపతులకు ముగ్గురు సంతానంకాగా వీరిలో ఇద్దరు ఆడపిల్లలు. పండు 9వ తరగతి వరకు చదివి, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కూలి పనులకు వెళుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి
కొత్తూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం మామిడిపాలెం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా వున్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన ఎం.రామిరెడ్డి (48), అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన జగదీశ్.. ఇదే మండలం మామిడిపాలెం పరిధిలో ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేసిన మైనింగ్ చెక్‌పోస్టులో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరూ కలిసి బైక్‌పై అనకాపల్లి వైపు వస్తున్నారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత అదే మార్గంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం (స్కూటీ) బలంగా ఢీకొన్నది. దీంతో రామిరెడ్డి, జగదీశ్ రోడ్డుపై పడిపోయి, తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్కూటీతో ఢీకొన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ రావడంతో క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పతికి తరలించారు. రామిరెడ్డి చికిత్స పొందుతూ రాత్రి ఎనిమిది గంటల సమయంలో మృతిచెందాడు. ప్రమాదం గురించి రామిరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు బయలుదేరి వస్తున్నారని ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.