Share News

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మణం

ABN , Publish Date - May 22 , 2026 | 12:06 AM

ఎలమంచిలి, రాంబిల్లి, రావికమతం మండలాల్లో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై ఎలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్‌ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గోతిలోకి బోల్తా పడడంతో కాకినాడ జిల్లాకు చెందిన ఒక యువకుడు మృతిచెందాడు. రాంబిల్లి మండలం గొరపూడి మెట్ట వద్ద బైక్‌ను వ్యాన్‌ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. రావికమతం మండలం మట్టవానిపాలెంలో ట్రాక్టర్‌ బోల్తా పడి కూలీ మృతిచెందాడు. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మణం

మర్రిబంద జంక్షన్‌ వద్ద కారు అదుపుతప్పి బోల్తా

ఒక యువకుడు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

గొరపూడి వద్ద బైక్‌ను వ్యాన్‌ ఢీకొని ఒకరి మృతి

మట్టవానిపాలెంలో ట్రాక్టర్‌ బోల్తా పడి కూలీ..

ఎలమంచిలి/ రాంబిల్లి/ రావికమతం మే 21 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి, రాంబిల్లి, రావికమతం మండలాల్లో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై ఎలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్‌ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గోతిలోకి బోల్తా పడడంతో కాకినాడ జిల్లాకు చెందిన ఒక యువకుడు మృతిచెందాడు. రాంబిల్లి మండలం గొరపూడి మెట్ట వద్ద బైక్‌ను వ్యాన్‌ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. రావికమతం మండలం మట్టవానిపాలెంలో ట్రాక్టర్‌ బోల్తా పడి కూలీ మృతిచెందాడు. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన పెనుమళ్లు వెంకట నాగ బుల్లి ప్రసాదరెడ్డి (30) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఇతని తండ్రి క్యాన్సర్‌ బారిన పడడంతో చికిత్స నిమిత్తం విశాఖ నగర శివారులోని అగనంపూడి వద్ద వున్న టాటా క్యాన్సర్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం కాకినాడకు చెందిన స్నేహితుడు పి.మణికుమార్‌రెడ్డితో కలిసి కారులో ఇక్కడకు వచ్చారు. తండ్రిని ఆస్పత్రిలో చేర్చిన తరువాత గురువారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి కాకినాడ బయలుదేరారు. దారిలో ఎలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్‌ సమీపంలో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కన సుమారు 15 అడుగుల లోతు వున్న గొయ్యిలోకి దూసుకుపోయి బోల్తా పడింది. దీంతో కారు నడుపుతున్న ప్రసాదరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. ఎయిర్‌ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. పి.మణికుమార్‌ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఇతనిని అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యాన్‌ ఢీకొని..

రాంబిల్లి మండలం కొండవారపాలెం గ్రామానికి చెందిన బత్తిన రమణ (47) గురువారం ఉదయం సొంత పనిమీద బైక్‌పై చింతువ గ్రామానికి వెళ్లారు. తిరిగి 10 గంటల సమయంలో కొండవారపాలెం వస్తుండగా గొరపూడి మెట్ట వద్ద ఎదురుగా రాంబిల్లి నుంచి లాలంకోడూరు వైపు వెళుతున్న వ్యాన్‌ బైక్‌ను ఢీకొన్నది. దీంతో తీవ్రంగా గాయపడిన రమణ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వచ్చి కన్నీరుమున్నీరు అయ్యారు. అనంతరం పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కోటేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నాగేంద్ర తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తా పడి కూలీ..

బుచ్చెయ్యపేట మండలానికి చెందిన ఒక కలప వ్యాపారి రావికమతం మండలం గుడివాడ పంచాయతీ శివారు మట్టవానిపాలెం పొలాల్లో కలప చెట్లను కొనుగోలు చేశారు. గురువారం వీటిని కూలీలతో నరికించి, కలప దుంగలను సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ట్రాక్టర్‌పై తరలిస్తున్నారు. ఈ క్రమంలో కాలువ గట్టు ఎక్కుతుండగా ట్రాక్టర్‌ ఇంజన్‌ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్‌ పక్కన కూర్చున్న కొల్లి నాగరాజు(48) అనే కూలిపై ఇంజన్‌ కింద చిక్కుపోయాడు. తోటి కూలీలు, సమీపంలో వున్న రైతులు కలిసి ట్రాక్టర్‌ ఇంజన్‌ను పైకిలేపారు. కానీ నాగరాజు అప్పటికే మృతిచెందాడు. డ్రైవర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రఘువర్మ సంఘటనా స్ధలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - May 22 , 2026 | 12:06 AM