Share News

రౌడీ షీటర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:42 PM

రౌడీ షీటర్‌ ఉపేంద్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

  రౌడీ షీటర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న కె .కోటపాడు సీఐ కృష్ణయ్య

పోలీసుల అదుపులో బాలుడు

మాడుగుల రూరల్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రౌడీ షీటర్‌ ఉపేంద్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కె.కోటపాడు సీఐ కృష్ణయ్య మంగళవారం మాడుగుల పోలీస్‌ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

మాడుగుల మండలం జంపెన గ్రామానికి చెందిన పెచ్చెట్టి ఉపేంద్ర గత ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తన ఇంటి నుంచి బైక్‌పై బయల్దేరి కింతలి వైపు వెళుతుండగా గాదిరాయి- వమ్మలి గ్రామాల మధ్య మలుపు రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించారు. ఇనుపరాడ్లతో దాడి చేయడంతో రక్తపు మడుగులో సంఘటనా స్థలంలోనే ఉపేంద్ర మృతి చెందాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న వ్యక్తులు చూసి మాడుగుల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ నారాయణరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి ఉపేంద్రగా నిర్ధారించి అతని తల్లిదండ్రులు అప్పారావు, సత్యవతిలకు సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, సీఐ కృష్ణయ్య, క్లూస్‌ టీం పరిశీలించి సంఘటనా స్థలం వద్ద లభ్యమైన పలు వస్తువులను సేకరించారు. మృతుడు తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సి దర్యాప్తు చేపట్టారు. జంపెన గ్రామానికి చెందిన పలువురు అనుమానితులను స్టేషన్‌కి రప్పించి వివరాలు సేకరించారు.

నిందితుల అరెస్టు

ఉపేంద్ర హత్య కేసులో నిందితులను మాడుగుల పోలీసులు మాడుగుల మండలం ఘాట్‌రోడ్డు జంక్షన్‌ వద్ద ఈ నెల 2న సాయంత్రం ఐదు గంటల సమయంలో పట్టుకున్నారని సీఐ తెలిపారు. పట్టుబడిన వ్యక్తులు జంపెన గ్రామానికి చెందిన వారేనని, ఇందులో ఒకరు మైనర్‌ ఉన్నారన్నారు. ఉపేంద్ర గతంలో జంపెన గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను డబ్బు కోసం హత్య చేశాడని, జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చాడని చెప్పారు. ఇటీవల పలు కేసుల్లో కూడా జైలు శిక్షలో బెయిల్‌పై గత ఫిబ్రవరి 24న బయటకు వచ్చాడన్నారు. అంతకు ముందు ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి ఉపేంద్ర పంట కళ్లం సమీపాన ఒక అగ్నిప్రమాదంలో పశువుల పాకతో పాటు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. గతంలో ఉపేంద్ర కుటుంబ సభ్యులకు, మంటల్లో కాలిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు భూ తగాదాలు ఉన్నాయని, అందుకే అగ్నిప్రమాదాన్ని ఉపేంద్ర చేసి ఉంటాడని పట్టుబడిన వ్యక్తుల్లో (మంటల్లో మృతి చెందిన వ్యక్తి బంధువులు) ఇద్దరు కక్ష పెంచుకున్నారని సీఐ తెలిపారు. గ్రామంలో ఉపేంద్ర ఉంటే మరిన్ని హత్యా నేరాలు జరుగుతాయని, గ్రామంలో ఎవరూ ప్రశాంతంగా ఉండరని భావించిన నిందితులు పథకం ప్రకారం హత్య చేశారన్నారు. ఈ కేసుకి సంబంధించి ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారని, వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి మంగళవారం ముగ్గురు వ్యక్తులను చోడవరం కోర్టులో హాజరు పరచగా చోడవరం సబ్‌జైలుకి రిమాండ్‌ విధించారని, బాలుడిని విశాఖపట్నం జువెనైల్‌ హోంకి తరలించారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

Updated Date - Mar 03 , 2026 | 11:42 PM