పేదల కాలనీలకు ముప్పు
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:00 AM
మండలంలోని గంగవరం, నంగినారపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పేద ఇళ్ల కాలనీల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. కొద్ది రోజుల నుంచి ఇక్కడ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కొన్నిచోట్ల పది అడుగుల పైడి లోతున గ్రావెల్ తవ్వుతుండడంతో సమీపంలోని ఇళ్లకు ముప్పుపొంచి వుంది.
ఇళ్లకు సమీపంలో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు
గంగవరం, నంగినారపాడు గ్రామాల్లో 800 ప్లాట్లు కనుమరుగు
పట్టించుకోని వీఎంఆర్‌డీఏ అధికారులు
సబ్బవరం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గంగవరం, నంగినారపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పేద ఇళ్ల కాలనీల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. కొద్ది రోజుల నుంచి ఇక్కడ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కొన్నిచోట్ల పది అడుగుల పైడి లోతున గ్రావెల్ తవ్వుతుండడంతో సమీపంలోని ఇళ్లకు ముప్పుపొంచి వుంది.
మండలంలోని గంగవరం పరిధిలో 7,541 మందికి, నంగినారపాడు పరిధిలో 6,557 మంది పేదలకు గత ప్రభుత్వం సెంటు చొప్పున ఇళ్లు స్థలాలు కేటాయించింది. ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశారు. ఈ ప్రాంతంలో నాణ్యమైన గ్రావెల్ నిల్వలు వుండడంతో అక్రమార్కులు ఇళ్ల కాలనీలను ఆనుకొని తవ్వకాలు చేపట్టారు. రాత్రి పూట యంత్రాలతో గ్రావెల్ తవ్వి, భారీ టిప్పర్ లారీల్లో తరలించుకుపోతున్నారు. వెదుళ్లనరవ, కొత్తూరు, దువ్వాడ పరిధిలోని సంధ్యానరగ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ఇక్కడి నుంచి గాజువాక, కూర్మన్నపాలెం, తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. కాగా గ్రావెల్ తవ్వకాలతో గత మూడేళ్ల కాలంలో ఇక్కడ సుమారు 800 ప్లాట్లతోపాటు సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిహారం కింద రైతులకు ఇచ్చిన ప్లాట్లు కనిపించడలేదని అధికారులు తేల్చారు. దీనికితోడు గ్రావెల్ రవాణా చేసే భారీ వాహనాల రాకపోకలతో కాలనీల్లో రహదారు ధ్వంసం అవుతున్నాయి. పేదల ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టిన వీఎంఆర్‌డీఏ అధికారులు ఇటువైపు కన్నెత్తి అయినా చూడడంలేదు. వీఎంఆర్‌డీఏలో కొంత మంది దిగువస్థాయి సిబ్బంది సహకారంతోనే గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.