మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి తప్పిన ముప్పు
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:46 AM
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి గురువారం పెనుప్రమాదం తప్పింది. వరదనీరు ఒక్కసారిగా ప్రాజెక్టు లోపల గల టర్బన్‌లోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులు, కార్మికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాజెక్టుకు ముప్పు తప్పింది.
- టర్బన్‌లోకి ప్రవేశించిన వరదనీరు
- అధికారుల సమయస్ఫూర్తితో గట్టెక్కిన వైనం
ముంచంగిపుట్టు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి గురువారం పెనుప్రమాదం తప్పింది. వరదనీరు ఒక్కసారిగా ప్రాజెక్టు లోపల గల టర్బన్‌లోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులు, కార్మికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాజెక్టుకు ముప్పు తప్పింది.
తుఫాన్ కారణంగా జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో వరదనీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో జోలాపుట్టు జలాశయం నుంచి గురువారం ఉదయం 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలో గల డుడుమకు విడుదల చేశారు. అయితే జలవిద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేసే డుడుమ జలాశయం పవర్ గేట్ సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో వరదనీరు ఆ గేటు గుండా టీపీ(టర్నల్ పాయింట్)డ్యామ్‌కు అధికంగా చేరుకోవడం, అక్కడ నుంచి జలవిద్యుత్ కేంద్రంలో గల విద్యుదుత్పాదనకు వినియోగించే 4, 5, 6 నంబర్లు గల జనరేటర్ల టర్బన్లలోకి వరదనీరు ప్రవేశించింది. అయితే ఆ మూడు జనరేటర్లు ప్రస్తుతం వినియోగంలో లేకపోవడం, ఇంజనీరింగ్ అధికారులు, కార్మికులు సకాలంలో సమయస్ఫూర్తిగా స్పందించడంతో ప్రాజెక్టుకు పెనుప్రమాదం తప్పింది. ఆ జనరేటర్లు వినియోగంలో ఉండి ఉంటే ప్రాజెక్టుకు పెనుప్రమాదం సంభవించే ప్రమాదం ఉండేది. వెంటనే లోపలకు ప్రవేశించిన నీటిని నియంత్రించేందుకు సుమారు గంటపాటు శ్రమించారు. మొదటిగా డుడుమ, జోలాపుట్టు జలాశయాల నుంచి నీటి విడుదలను నియంత్రించారు. జోలాపుట్టు జలాశయం నుంచి సుమారు 6 వేల క్యూసెక్కుల నీరు విడుదలను తగ్గించారు. దీంతో కొంత సమయం తరువాత ప్రాజెక్టులోకి వరదనీరు ప్రవేశించడం తగ్గుముఖం పట్టింది. మూడు టర్బన్‌ల వద్ద నీటిని బయటకు పంపించి, చుట్టూ ఇసుకబస్తాలను ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల్లో ఆ జనరేటర్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం 1, 2, 3 జనరేటర్ల సహాయంతో 51 మెగావాట్ల విద్యుదుత్పాదన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రాజెక్టు ఎస్‌ఈ సీహెచ్.అప్పాజీ, ఈఈగోవిందరాజులు ప్రాజెక్టును సందర్శించి, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.