ఆక్రమణల బెడద
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:57 AM
నగర శివారున సెంటు స్థలాల్లో పేదల ఇళ్లకు అభివృద్ధిచేసిన లేఅవుట్‌లలో ఖాళీ స్థలాలపై కబ్జాదారుల కన్నుపడింది. కాలనీలకు ఆనుకుని ఖాళీగా ఉన్న స్థలాలను కొన్నిచోట్ల చదునుచేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
సెంటు భూమి కాలనీకి ఆనుకున్న స్థలాలపై కబ్జాదారుల కన్ను
రామవరంలో ఎకరన్నర స్థలం విక్రయం
పట్టించుకోని హౌసింగ్, రెవెన్యూ అధికారులు
విశాఖపట్నం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి):
నగర శివారున సెంటు స్థలాల్లో పేదల ఇళ్లకు అభివృద్ధిచేసిన లేఅవుట్‌లలో ఖాళీ స్థలాలపై కబ్జాదారుల కన్నుపడింది. కాలనీలకు ఆనుకుని ఖాళీగా ఉన్న స్థలాలను కొన్నిచోట్ల చదునుచేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
ఆనందపురం మండలం రామవరంలో ఒక రైతు ఏకంగా ఎకరన్నర స్థలాన్ని కబ్జా చేసి స్థానికులకు విక్రయించారు. కాలనీలో 2,235మంది లబ్ధిదారులకు సుమారు 40 ఎకరాల భూమి సమీకరించారు. భూములు ఇచ్చిన డీపట్టా రైతులకు ఎకరాకు 900 గజాల అభివృద్ధిచేసిన ప్లాట్లను కేటాయించారు. అయితే పట్టాలు ఇచ్చిన మేరకు ఇళ్లు నిర్మించే బాధ్యత ఒక ఏజెన్సీకి అప్పగించారు. పలు కారణాలతో మొత్తం ఇళ్లు నిర్మించడంలో సదరు ఏజెన్సీ విఫలమైంది. దీంతో కాలనీలో చాలా స్థలం ఖాళీగా ఉంది. మరికొంత సామాజిక అవసరాల కోసం ఉంచారు. అయితే కాలనీకి భూములు ఇచ్చిన ఓ రైతు ఒకరు సుమారు ఎకరన్నర స్థలాన్ని స్థానికులకు విక్రయించారు. కొనుగోలుచేసిన వ్యక్తి అక్కడ నీలగిరి తోట పెంచుతున్నారు. కాలనీలో మొత్తం ఇళ్లు పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు నివాసం ఉండేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో స్థలం విక్రయించిన సంగతి ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు. అక్కడ ఇళ్ల నిర్మించే కాంట్రాక్టరు వద్ద పనిచేసే ఒకరు కాలనీ మధ్యలో నీలగిరి తోట పెంచుతున్నట్టు గుర్తించి అఽధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయినా హౌసింగ్ కార్పొరేషన్‌లో కిందిస్థాయి అధికారులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగిలిన కాలనీల్లో ఖాళీ స్థలాలు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయనే వాదన వినిపిస్తోంది.