Share News

గ్రానైట్‌ లారీలతో ముప్పు

ABN , Publish Date - May 25 , 2026 | 12:15 AM

భారీ గ్రానైట్‌ శిలలు తరలించే ట్రాలర్‌ లారీలతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని పలు రహదారులు, వంతెనలకు ముప్పు పొంచివుంది. ముఖ్యంగా బీఎన్‌ రోడ్డులో శిథిలావస్థకు చేరిన కల్వర్టులు, వంతెనలు కూలిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వంతెన సామర్థ్యంకన్నా రెట్టింపు బరువుతో గ్రానెట్‌ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఆర్‌అండ్‌బీ, పోలీసు, రవాణా శాఖల అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు.

గ్రానైట్‌ లారీలతో ముప్పు
చోడవరం వద్ద రహదారి పక్కన గ్రానైట్‌ లారీలు (ఫైల్‌ ఫొటో)

పరిమితికి మించి శిలల రవాణా

ఛిద్రమవుతున్న రహదారులు

వంతెనలు, కల్వర్టులు కూలిపోయే ప్రమాదం

పట్టించుకోని ఆర్‌అండ్‌బీ, రవాణా, పోలీసు శాఖలు

చోడవరం, మే 24 (ఆంధ్రజ్యోతి): భారీ గ్రానైట్‌ శిలలు తరలించే ట్రాలర్‌ లారీలతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని పలు రహదారులు, వంతెనలకు ముప్పు పొంచివుంది. ముఖ్యంగా బీఎన్‌ రోడ్డులో శిథిలావస్థకు చేరిన కల్వర్టులు, వంతెనలు కూలిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వంతెన సామర్థ్యంకన్నా రెట్టింపు బరువుతో గ్రానెట్‌ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఆర్‌అండ్‌బీ, పోలీసు, రవాణా శాఖల అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు.

చోడవరం నియోజకవర్గం రావికమతం, మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలంలో పది నుంచి పదిహేను వరకు గ్రానైట్‌ క్వారీలు వున్నాయి. వీటి నుంచి భారీ గ్రానైట్‌ శిలలను విశాఖ, చెన్నైలకు తరలిస్తుంటారు. ట్రాలర్ల సామర్థ్యాన్నిబట్టి (టైర్లు) ఒక్కో వాహనంపై రెండు నుంచి నాలుగు వరకు శిలలను రవాణా చేస్తారు. ఆయా క్వారీల నుంచి గ్రానైట్‌ రాళ్లను రావికమతం, మాడుగుల, బుచ్చెయ్యపేట, చోడవరం, అనకాపల్లి మండలాల మీదుగా జాతీయ రహదారికి చేరుకొని గమ్యస్థానాలకు తరలిస్తుంటారు. ఒక్కో లారీపై వంద టన్నులకు పైబడి గ్రానైట్‌ శిలలను రవాణణ చేస్తున్నారు. దీంతో ఆయా రహదారులు.. ముఖ్యంగా బీఎన్‌ రోడ్డు ఛిద్రం అవుతున్నాయి. ఈ మార్గాల్లో పలుచోట్ల వున్న కల్వర్టులు, వంతెనలు శిథిలావస్థకు చేరడంతో గ్రానైట్‌ తరలించే ట్రాలర్‌ లారీలతో ముప్పు పొంచివుంది. గ్రానైట్‌ శిలలను తరలించే వాహనాల కారణంగానే వడ్డాది, విజయరామరాజుపేటల వద్ద వంతెనలు కూలిపోయాయి. ఇంతవరకు ఆయా ప్రదేశాల్లో కొత్త వంతెనలు నిర్మించలేదు. తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టుల మీదుగా వాహనాలు నడుస్తున్నాయి. ఈ మార్గంలో పాత వాటిల్లో మిగిలింది గోవాడ వద్ద శారదా నదిపై ఉన్న వంతెన. గ్రానైట్‌ రవాణా వాహనాలు ఈ వంతెన మీదుగా వెళుతున్నప్పుడు ప్రకంపనలు వస్తున్నాయని పలువురు వాహనదారులు చెబుతున్నారు. చోడవరం- వెంకన్నపాలెం మధ్య రెండు శిఽథిల కల్వర్టులు వున్నాయి. గ్రానైట్‌ వాహనాల ధాటికి వీటికి ముప్పు వాటిల్లితే బీఎన్‌ రోడ్డులో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గ్రానైట్‌ లారీల దూకుడుపై పత్రికల్లో కథనాలు వచ్చినా, ప్రజలు ఆందోళనలు చేసినా.. అధికారులు పట్టించుకోవడంలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రహదారులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాయని, గ్రానైట్‌ శిలలను రవాణా చేసే వాహనాలతో ఛిద్రమై పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని ఆయా మండలాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్‌ లారీల వల్ల రోడ్లు పాడైపోతుంటే ఆర్‌అండ్‌బీ, రవాణా, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని అంటున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి గ్రానైట్‌ లారీలను కట్టడి చేయకపోతే బీఎన్‌ రోడ్డు మరింత దారుణంగా తయారవుతుందని ఆందోళనే చెందుతున్నారు.

Updated Date - May 25 , 2026 | 12:15 AM