ఉపమాక వెంకన్న కల్యాణోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:47 AM
ఉపమాక క్షేత్రంలో వచ్చే నెల 26 నుంచి జరగనున్న స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలను టీటీడీ, ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని హోం మంత్రి అనిత ఆదేశించారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
టీటీడీ లడ్డూ ప్రసాదాల విక్రయాలు
అధికారులతో సమీక్షలో హోం మంత్రి అనిత
నక్కపల్లి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):
ఉపమాక క్షేత్రంలో వచ్చే నెల 26 నుంచి జరగనున్న స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలను టీటీడీ, ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. వెంకన్న కల్యాణోత్సవాలపై సోమవారం ఉదయం ఆలయంలో నాయకులు, అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపమాక వెంకన్న తమ ఇలవేల్పని, అందుకే అభివృద్ధి పనుల కోసం టీటీడీ నుంచి రూ.5.46 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్సవాల సమయంలో 40 నుంచి 50 వేల వరకు టీటీడీ లడ్డూ ప్రసాదాలను ఇక్కడ విక్రయించేలా టీటీడీ చైర్మన్, ఈవోలతో మాట్లాడతానని చెప్పారు. ఆలయం లోపల, చుట్టుపక్కల ప్రదేశాల్లో శుభ్రత లోపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి ఉత్సవాలకు ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావులను తీసుకురావాలని, అవసరమైతే తాను కూడా వారితో మాట్లాడతానని చెప్పారు. అంతకుముందు ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రి వెంట ఆలయ మాజీ చైర్మన్ కొప్పిశెట్టి కొండబాబు, టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్, పీఏసీఎస్ చైర్ పర్సన్ కొప్పిశెట్టి బుజ్జి, ఏఎంసీ చైర్మన్ దేవర సత్యనారాయణ, సర్పంచ్ వీరబాబు, టీడీపీ నాయకులు కురందాసు నూకరాజు, గింజాల లక్ష్మణరావు, వెలగా శ్రీను, గోసల చినతాతారావు తదితరులు వున్నారు.
మాఘపౌర్ణమి ఏర్పాట్లపై సమీక్ష
మాఘ పౌర్ణమి సందర్భంగా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో జరిగే జాతర ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, పోలీసు బందోబస్తు గురించి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ ఎల్.రామకృష్ణతో మంత్రి అనిత చర్చించారు. సముద్రస్నానాలు చేసే వారు ప్రమాదానికి గురికాకుండా గజఈతగాళ్లను, మెరైన్ బృందాలను అందుబాటులో వుంచాలన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ ఏజెర్ల వినోద్‌రాజు, టీడీపీ ఎస్.రాయవరం మండల నాయకులు అమలకంటి అబద్ధం, నల్లపరాజు వెంకట్రాజు, తదితరులు పాల్గొన్నారు.
పేట మెయిన్ రోడ్డు విస్తరణ
ఆక్రమణల తొలగింపు పనులు ఇప్పటికే ప్రారంభం
ఈ నెలాఖరులోగా హోం మంత్రి శంకుస్థాపన
తొలి దశలో రూ.5.25 కోట్లతో డబుల్ రోడ్డుగా అభివృద్ధి, డివైడర్ ఏర్పాటు
రెండో దశలో రూ.4.75 కోట్లతో డ్రైనేజీ కాలువలు, సెంటర్ లైటింగ్
వీఎంఆర్డీఏ ఈఈ రాంబాబు వెల్లడి
పాయకరావుపేట, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):
స్థానిక మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వీఎంఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు తెలిపారు. సోమవారం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన పట్టణంలోని గౌతమ్ థియేటర్ సెంటర్‌లో శంకుస్థాపనకు సంబంధించి శిలాఫలకం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు రెండు కిలోమీటర్లున్న పాయకరావుపేట మెయిన్‌రోడ్డును డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసి, డివైడర్ ఏర్పాటు, సెంటర్ లైటింగ్, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీల కాలువల ఏర్పాటుకు సుమారు రూ.10 కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. మొదటి దశలో రూ.5.25 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం, డివైడర్ ఏర్పాటు వంటి పనులు చేపడతామని తెలిపారు. రెండో దశలో రూ.4.75 కోట్లతో రోడ్డుకు ఇరువైపులా బెర్మ్, డ్రైనేజీ కాలువలు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ఇరువైపులా ఆక్రమణలు తొలగింపు కొనసాగుతున్నదని, ఈ నెలాఖరున రోడ్డు విస్తరణ పనులకు హోం మంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేస్తారని, వచ్చే నెల మొదటి వారంలో విస్తరణ పనులు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ ఏఈ లోకేశ్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు యాళ్ల వరహాలబాబు, నాయకులు బొంది కాశీవిశ్వనాథం, మజ్జూరి నారాయణరావు, చింతకాయల రాంబాబు, మలిపెద్ది వెంకటరమణ, జూరెడ్డి ప్రసాద్, వేములపూడి అప్పారావు, ఆది, తదితరులు పాల్గొన్నారు.