Share News

మో‘డల్‌’ కాలనీ ఇదే!

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:16 AM

పేరుకే అది మోడల్‌ కాలనీ. కానీ కనీస వసతులు లేవు. డ్రైనేజీలు, పక్కా రోడ్లు లేవు. తాగునీటి సదుపాయం లేదు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లేదు. ఇరవై ఏళ్లుగా ఇదే పరిస్థితి.. ఇదీ మండలంలోని చల్ధిమామిడి గ్రామంలో గల శరత్‌కుమార్‌ మోడల్‌ కాలనీ దుస్థితి.

మో‘డల్‌’ కాలనీ ఇదే!
డ్రైనేజీ, పక్కా రహదారికి నోచుకోని మోడల్‌ కాలనీ

కనీస వసతులు కరువు

తాగునీటికి కష్టాలు.. రోడ్లు, డ్రైనేజీలు లేక అవస్థలు

ఇరవై ఏళ్ల క్రితం చల్ధిమామిడి గ్రామంలో శరత్‌కుమార్‌ మోడల్‌ కాలనీ ఏర్పాటు

ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోని వైనం

పెదబయలు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పేరుకే అది మోడల్‌ కాలనీ. కానీ కనీస వసతులు లేవు. డ్రైనేజీలు, పక్కా రోడ్లు లేవు. తాగునీటి సదుపాయం లేదు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లేదు. ఇరవై ఏళ్లుగా ఇదే పరిస్థితి.. ఇదీ మండలంలోని చల్ధిమామిడి గ్రామంలో గల శరత్‌కుమార్‌ మోడల్‌ కాలనీ దుస్థితి.

మండలంలోని లక్ష్మీపేట పంచాయతీ కేంద్రానికి సమీపంలో ఇరవై ఏళ్ల క్రితం అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శరత్‌కుమార్‌ చొరవతో ఆయన పేరున మోడల్‌ కాలనీ ఏర్పాటైంది. ఈ ప్రాంతంలో కొండ అంచున నివసిస్తున్న గిరిజన కుటుంబాలు భారీ వర్షాలు, తుఫానుల సమయంలో వరద ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అప్పటి పీవో శరత్‌కుమార్‌ చొరవతో ప్రధాన రహదారి పక్కన 35 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోడల్‌ కాలనీ ఏర్పాటు చేసి గిరిజనులను అక్కడికి తరలించారు. మోడల్‌ కాలనీ కదా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తారని ఆశ పడ్డ గిరిజనులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వాలు, అధికారులు మారినా ఇప్పటి వరకు ఆ కాలనీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాలనీలో తాగునీటి సదుపాయం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లేక కష్టాలు తప్పడం లేదు. అలాగే పక్కా రోడ్లు, డ్రైనేజీలు లేక కాలనీ మొత్తంగా బురదమయంగా ఉంటోందని, కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ సమస్యలపై పాడేరు ఐటీడీఏలో జరిగిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో కనీస వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:16 AM