ఇది కదా అభివృద్ధి!
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:59 AM
గత వైసీపీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన అసకపల్లి-లంకెలపాలెం రోడ్డుకు కూటమి పాలనలో మహర్దశ పట్టింది. సుమారు రెండున్నర కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి పునర్నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.
రూ.2.5 కోట్లతో అసకపల్లి- లంకెలపాలెం రోడ్డు నిర్మాణం
ఈ నెలాఖరులోగా పనులు పూర్తి
వైసీపీ హయాంలో అధ్వానంగా ఉన్న రహదారి
సబ్బవరం, ఫిబ్రవరి 12 (ఆంరఽధజ్యోతి): గత వైసీపీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన అసకపల్లి-లంకెలపాలెం రోడ్డుకు కూటమి పాలనలో మహర్దశ పట్టింది. సుమారు రెండున్నర కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి పునర్నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.
సబ్బవరం మండలం అసకపల్లి నుంచి పరవాడ మండలం (జీవీఎంసీ పరిధి) లంకెలపాలెం వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర ఉన్న రహదారి పాత, కొత్త జాతీయ రహదారులను అనుసంధానం చేస్తుంది. పలు గ్రామాలతోపాటు పరవాడ, అచ్యుతాపురం సెజ్‌లోని పరిశ్రమలకు ముడి పదార్థాల దిగుమతి, తయారైన వస్తువుల ఎగుమతికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వాహనాలు ఈ మార్గంలోనే వెళుతుంటాయి. ఎంతో ప్రధానమైన ఈ రహదారి గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. పలుచోట్ల భారీ గోతులు ఏర్పడడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రిపూట ద్విచక్ర వాహనాదారులు ప్రమాదాలకు గురయ్యారు. గోతుల వద్ద భారీ వాహనాలు బోల్తా పడేవి. అప్పటి ప్రభుత్వం కనీసం గోతులను కూడా పూడ్చలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ఎంపీ సీఎం రమేశ్ చొరవ తీసుకొని ఎన్టీపీసీ నుంచి రూ.70 లక్షల సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేయించి మరమ్మతు పనులు చేయించారు. గత ఏడాది వర్షాలకు మళ్లీ దెబ్బతినడంతో ప్రభుత్వం నుంచి రూ. 2.5 కోట్లు మంజూరు చేయించారు. పది రోజుల క్రితం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులోగా మిగిలిన రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేస్తామని ఆర్‌అండ్‌బీ ఏఈ బాలరాజు తెలిపారు.