Share News

ముగిసిన మూడో విడత నామినేషన్ల ఘట్టం

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:36 AM

జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారంతో ముగిసింది.

ముగిసిన మూడో విడత నామినేషన్ల ఘట్టం
పాడేరులో నామినేషన్ల ఆఖరి రోజైన సోమవారం కూటమి శ్రేణుల సందడి

91 పంచాయతీలకు 734, అలాగే 880 వార్డులకు 2,054 నామినేషన్లు దాఖలు

27న అభ్యర్థుల తుది జాబితా

2న ఎన్నికలు

పాడేరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. మొత్తం నాలుగు మండలాల్లోని 36 నామినేషన్‌ కేంద్రాల్లో మూడు రోజుల పాటు సర్పంచులకు 734, వార్డులకు 2,054 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిని అధికారులు 24న పరిశీలించి, 25న అభ్యంతరాలను స్వీకరించి, 27న ఉపసంహరణ ప్రక్రియ చేపట్టి అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తారు. జిల్లాలో మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మూడు విడతలుగా మొదటి విడత ఎన్నికలు ఈ నెల 26న, రెండో విడత 29న, మూడో విడత ఎన్నికలు డిసెంబరు 2న నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. ఇందులో భాగంగా మూడో విడతగా జిల్లాలోని పాడేరు మండలంలో 26 పంచాయతీలు- 246 వార్డులు, అరకులోయలో 14 పంచాయతీలు- 164 వార్డులు, డుంబ్రిగుడలో 18 పంచాయతీలు- 188 వార్డులు, హుకుంపేట మండలంలో 33 పంచాయతీలు- 282 వార్డులకు డిసెంబరు 2న ఎన్నికలు జరుగుతాయి. ఆ నాలుగు మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు 36 కేంద్రాలను, ఎన్నికలకు 880 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పాడేరు మండలంలో 44,536, అరకులోయలో 41,480, డుంబ్రిగుడలో 38,743, హుకుంపేటలో 45,787 మంది ఓటర్లున్నారు.

Updated Date - Nov 24 , 2026 | 12:36 AM