నాన్న వస్తారని..
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:08 AM
రోజూ చీకటిపడే సమయానికి ఇంటికి వచ్చే నాన్న, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఆ చిన్నారులకు తెలియదు. తమ ఇంటికి వచ్చిన బంధువులు ఎందుకు ఏడుస్తున్నారో అర్థంకాని వయసు వారిది. నాన్న కోసం అమాయకంగా ఎదురుచూస్తున్న ముగ్గురు చిన్నారులను చూస్తే.. అక్కడున్న వారిని కంటతడిపెట్టిస్తున్నది. నాన్న ఎప్పుడు వస్తారు అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్న ఆ పిల్లలకు.. సమాధానం చెప్పలేక కుటుంబ సభ్యులు, బంధువులు మౌనంగా రోదిస్తున్నారు.
అమాయకంగా ఎదురుచూస్తున్న ముగ్గురు చిన్నారులు
దక్షిణ ఎనర్జీ పరిశ్రమ ప్రమాదంలో గోవాడకు చెందిన వెంకటేశ్ మృతి
ఇంటి వద్ద విషాదంలో కుటుంబ సభ్యులు, బంధువులు
పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం
చోడవరం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రోజూ చీకటిపడే సమయానికి ఇంటికి వచ్చే నాన్న, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఆ చిన్నారులకు తెలియదు. తమ ఇంటికి వచ్చిన బంధువులు ఎందుకు ఏడుస్తున్నారో అర్థంకాని వయసు వారిది. నాన్న కోసం అమాయకంగా ఎదురుచూస్తున్న ముగ్గురు చిన్నారులను చూస్తే.. అక్కడున్న వారిని కంటతడిపెట్టిస్తున్నది. నాన్న ఎప్పుడు వస్తారు అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్న ఆ పిల్లలకు.. సమాధానం చెప్పలేక కుటుంబ సభ్యులు, బంధువులు మౌనంగా రోదిస్తున్నారు. పరవాడలోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం ఉదయం సంభవించిన ప్రమాదంలో మండలంలోని గోవాడకు చెందిన టెక్నీషియన్‌గా వేపాడ వెంకటేశ్ మృతిచెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
గోవాడకు చెందిన వేపాడ శ్రీనివాసరావు, భవానీ దంపతుల పెద్ద కుమారుడైన వెంకటేశ్‌కు భార్య కమల, ముగ్గురు ఆడపిల్లలు ఇంద్రాణి (8 ఏళ్లు), వసంత (4 ఏళ్లు), మేఘన (మూడేళ్లు) ఉన్నారు. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో టెక్నీషియన్‌గా పనిచేస్తూ వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లిదండ్రులతోపాటు భార్య, ముగ్గురు పిల్లలకు ఏకైక ఆధారం వెంకటేశే. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ప్రమాదం జరిగి, భర్త మృతిచెందినట్టు తెలిసిన వెంటనే భార్య కమల హుటాహుటిన కంపెనీ వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. తనకు, ముగ్గురు ఆడపిల్లలకు దిక్కెవరంటూ రోదించారు.
ఒక్కగానొక్క కొడుకు..
అచ్యుతాపురం రూరల్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): పరవాడ సమీపంలోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో అచ్యుతాపురం మండలం జగ్గన్నపేటకు చెందిన బొద్దపు త్రినాథ్ (26) మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన బొద్దపు పారునాయుడు, రమణమ్మ దంపతులకు త్రినాథ్‌తోపాటు మరో కుమార్తె వుంది. ఇంకా వివాహం కాలేదు. చేతికి అందివచ్చిన కుమారుడు, పనిచేస్తున్న పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెంది శాశ్వతంగా దూరం కావడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.