Share News

రూ.కోట్లు ఇచ్చినా కదలని పనులు

ABN , Publish Date - May 27 , 2026 | 12:06 AM

పంచాయతీరాజ్‌ అరకు సబ్‌ డివిజన్‌ పరిధిలో నిధులు మంజూరైనా రహదారుల నిర్మాణం పూర్తికాలేదు. నిర్దేశించిన గడువు ముగిసినా అసంపూర్తి నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకుండా పనులు చేపట్టారు. పీఎంన్‌ జన్‌మన్‌ పథకం కింద కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను అధికారులు, కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూ.కోట్లు ఇచ్చినా కదలని పనులు
మెటల్‌ వేసి వదిలేసిన గేటువలస - బొండ్యాగుడ రోడ్డు

- మూడు మండలాల్లో 27 రోడ్లకు రూ.51.36 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

- గత ఏడాది పనులు ప్రారంభం

- నిర్దేశించిన గడువు ముగిసినా పూర్తికాని వైనం

- కొన్ని చోట్ల నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు

- డిప్యూటీ సీఎం స్వయంగా పరిశీలించి నిధులు విడుదల చేసిన రోడ్డుదీ అదే పరిస్థితి

- పట్టించుకోని ఇంజనీరింగ్‌ అధికారులు

అరకులోయ, మే 26 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ అరకు సబ్‌ డివిజన్‌ పరిధిలో నిధులు మంజూరైనా రహదారుల నిర్మాణం పూర్తికాలేదు. నిర్దేశించిన గడువు ముగిసినా అసంపూర్తి నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకుండా పనులు చేపట్టారు. పీఎంన్‌ జన్‌మన్‌ పథకం కింద కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను అధికారులు, కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పీఎం జన్‌మన్‌ పథకం కింద అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల పరిధిలో 27 రహదారులకు సంబంధించి 49.36 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గత ఏడాది రూ.51.36 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులన్నీ ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి కావాలని గడువు విధించింది. అయితే గడువు ముగిసినా చాలా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. ఒకే కాంట్రాక్ట్‌ సంస్థ టెండర్లు దక్కించుకుని పనులను సబ్‌ కాంట్రాక్ట్‌కు ఇవ్వడం వల్లే పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిసింది. డుంబ్రిగుడ మండలంలో రూ.20 కోట్లతో 12 రోడ్ల నిర్మాణాన్ని సబ్‌ కాంట్రాక్టర్‌ చేపడుతున్నారు. ఇందులో డుంబ్రిగుడ మండలం చాపరాయి సమీపంలో కోసంగి- పెదపాడు రోడ్డును ఏడాది క్రితం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పరిశీలించి ఆ రోడ్డు నిర్మాణానికి రూ.1.85 కోట్లు మంజూరు చేశారు. అయితే ఆ రోడ్డు నిర్మాణం విషయంలో సబ్‌ కాంట్రాక్టర్‌ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. దీంతో వేసిన రోడ్డు పెచ్చులూడిపోతూ అధ్వానంగా తయారైంది. దీనికి ప్రస్తుతం ప్యాచ్‌ వర్కు చేస్తున్నారు. అనంతగిరి, అరకులోయ మండలాలకు సంబంధించి గేటువలస, లోతేరు నుంచి బొండ్యాగుడ వరకు సుమారు రూ.2.69 కోట్లతో తారురోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ పనులు గడువు ముగిసినా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే కోనాపురం నుంచి లిడ్డంగి వరకు 5.35 కిలోమీటర్ల మేర రోడ్డుకు రూ.4.89 కోట్లతో పనులు చేపట్టినా ఇంకా పూర్తి కాలేదు. అరకులోయ మండలం లోతేరు పంచాయతీ పరిధిలోని దంసానివలస నుంచి ముసిరిగుడ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రూ.3.39 కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయి. ముసిరిగుడ- దూద్‌కొండి మధ్యలో కల్వర్టు నిర్మించాల్సి ఉంది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం కల్వర్టు నిర్మాణానికి 20 అడుగుల లోతున తవ్వి వదిలేశారు. దీంతో ఆయా గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఇదే పంచాయితీలో శిరోస్‌గుడ నుంచి బొరకాలివలస వరకు, దంసానివలస నుంచి లండిగుడ వరకు రూ.2 కోట్లతో చేపట్టిన రహదారి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గడువులోగా పనులను పూర్తి చేయించడం, నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత ఉన్నా ఇంజనీరింగ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే ఈ రహదారులకు ఈ దుస్థితి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ దృష్టి సారించి ఈ రహదారులు సకాలంలో పూర్తయ్యేలా చూడడంతో పాటు నాణ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 27 , 2026 | 12:06 AM